న్యూఢిల్లీ: అత్యవసర ఖర్చుల కోసం పీఎఫ్ ఖాతా నుంచి అడ్వాన్స్ తీసుకోవాలనుకునే ఉద్యోగులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్) స్పష్టమైన రూల్స్ ప్రకటించింది. ఆరోగ్యం, పిల్లల చదువులు, పెళ్లిళ్లు, ఇంటి అవసరాల కోసం సర్వీస్ మొత్తంలో ఎన్నిసార్లు పీఎఫ్ నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చో పేర్కొంది.
ఉద్యోగికి లేదా కుటుంబ సభ్యులకు జబ్బు చేస్తే పీఎఫ్ నుంచి డబ్బులు తీసుకోవ దానికి ఎలాంటి లిమిట్ లేదు. అవసరమైన ప్రతిసారీ అప్లై చేసుకోవచ్చు. పిల్లల పైచదువుల కోసం ఉద్యోగ జీవితం మొత్తంలో 10 సార్లు, పెళ్లి ఖర్చుల కోసం 5 సార్లు అడ్వాన్స్ తీసుకునే వెసులుబాటు ఉంది. ఇంటి అవసరాల కోసం మొత్తం సర్వీసులో 5 సార్లు, ఎమర్జెన్సీల్లో ఏడాదికి 2 సార్లు వాడుకోవచ్చు.
ఈపీఎఫ్ పై మండిపడ్డ కోర్టు
రూల్స్ ప్రకారం 20 రోజుల్లో పీఎఫ్ డబ్బులు ఇవ్వకుండా తిప్పించుకున్నందుకు ఈపీఎఫ్ఓ తీరుపై ముంబై వినియోగదారుల కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సరైన కారణం చెప్పకుండా క్లెయిము పెండింగ్ లో పెట్టడం సేవా లోపమేనని స్పష్టం చేసింది. ఫ్లీట్ మారిటైమ్ సర్వీసెస్ మాజీ ఉద్యోగి 2016 అక్టోబర్ 19న తన పీఎఫ్ డబ్బుల కోసం అప్లై చేసుకున్నారు.
కానీ నిబంధనల ప్రకారం 20 రోజుల్లో ఆయనకు డబ్బులు జమ కాలేదు. అప్లికేషన్ తో పాటు 'జాయింట్ డిక్లరేషన్' ఫారం పెట్టలేదని, అందుకే 2016 నవంబర్ 7న తిప్పి పంపామని అధికారులు వాదించారు. సరైన కాగితాలు డిసెంబర్ 2న వచ్చాక, కేవలం 12 రోజుల్లోనే (2016 డిసెంబర్ 14న) క్లెయిమ్ క్లియర్ చేశామని, తమ వైపు ఎలాంటి తప్పు లేదని చెప్పుకొచ్చారు.
దరఖాస్తులో ఏదైనా లోపం ఉంటే ఆ విషయాన్ని సదరు ఉద్యోగికి రాతపూర్వకంగా చెప్పినట్లు ఎలాంటి ఆధారాలు లేవని కమిషన్ తేల్చింది. ఏ సమాచారం ఇవ్వకుండా ఊరికే కూర్చోబెట్టడం ముమ్మాటికీ తప్పేనని స్పష్టం చేసింది. ఆలస్యమైన 35 రోజులకు గాను (నవంబర్ 9 నుంచి డిసెంబర్ 13 వరకు), మొత్తం క్లెయిమ్ అమౌంట్ రూ.14,06,272పై ఏడాదికి 6 శాతం వడ్డీ లెక్కగట్టి ఉద్యోగికి చెల్లించాలని ఈపీఎఫ్ ను ఆదేశించింది.
ఈ డబ్బులు ఇవ్వడానికి 45 రోజుల టైమ్ ఇచ్చింది. కాగా, ఈ ఉద్యోగి క్లెయిమ్ను 2016 లోనే ఈపీఎఫ్ ఓ పూర్తి చేయగా, 35 రోజులు ఆలస్యమైనందుకు గాను వడ్డీ కోసం వినియోగదారుల కోర్టును ఆయన ఆశ్రయించారు. తాజాగా తీర్పొచ్చింది.
