- నిందితుల ఇంటి ముందు బాధితుల ధర్నా
కూకట్పల్లి, వెలుగు: చిట్టీల పేరుతో అమాయకులను నమ్మించి కోట్ల రూపాయలు దండుకుని దంపతులు పరారయ్యారు. నిందితులు సుమారు రూ.50 నుంచి 70 కోట్ల వరకు అక్రమంగా వసూలు చేసినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. దీనిపై శుక్రవారం కేపీహెచ్బీ పోలీసులకు ఫిర్యాదు చేసి నిందితుల ఇంటి ఎదుట ధర్నా చేశారు. కేపీహెచ్బీ పరిధిలోని అడ్డగుట్ట సొసైటీలో 15 ఏండ్లుగా సీతమ్మ, రమణారెడ్డి దంపతులు చిట్టీల వ్యాపారం చేస్తుండగా, ఇందిరానగర్, సాయిచరణ్కాలనీ పరిసర కాలనీలు, బస్తీలకు చెందిన వారు సభ్యులుగా చేరారు.
పిల్లల చదువుల కోసం, ఇండ్ల నిర్మాణం, ఆరోగ్య అవసరాల కోసం అత్యవసర సమయంలో ఉపయోగపడతాయనే ఆశతో ఒక్కొక్కరు రూ.5 లక్షల నుంచి 20 లక్షల వరకు చిట్టీలు వేశారు. చిట్టీలు పూర్తయిన తర్వాత డబ్బులు ఇవ్వకుండా భారీగా వడ్డీ ఇస్తామని ఆశచూపి వారి వద్దే ఉంచుకున్నారు.
ఇలా సుమారు రూ.30 కోట్ల వరకు వసూలు చేసుకుని కొద్ది రోజుల కింద ఇంటికి తాళం వేసి పరారయ్యారు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ప్రస్తుతం 50 మంది పోలీసులకు ఫిర్యాదు చేయగా, విషయం తెలియని వారు వందల్లో ఉంటారని సమాచారం.
