న్యూయార్క్: ఎలాంటి సంచలనాలకు తావివ్వకుండా ఇద్దరు టాప్ సీడ్ ప్లేయర్లు.. యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ విమెన్స్ సింగిల్స్ టైటిల్ ఫైట్‌కు చేరుకున్నారు. బెలారస్ స్టార్ ప్లేయర్ అరీనా సబలెంక, కజకిస్తాన్ ప్లేయర్ ఎలెనా రిబకినా.. శనివారం జరిగే టైటిల్ ఫైట్‌లో అమీతుమీ తేల్చుకోనున్నారు.
గురువారం రాత్రి జరిగిన విమెన్స్ సింగిల్స్ సెమీస్‌లో టాప్‌సీడ్ సబలెంక 7–5, 6–2తో మూడోసీడ్ జెస్సికా పెగులా (అమెరికా)పై గెలిచింది. దాంతో వరుసగా మూడోసారి ఫైనల్‌కు చేరింది. 2012–14 మధ్య సెరెనా విలియమ్స్ తర్వాత ఫ్లషింగ్ మెడోస్‌లో మూడుసార్లు టైటిల్ ఎవరూ గెలవలేదు. ఆ రికార్డును సబలెంక సమం చేస్తుందేమో చూడాలి. గంటా 20 నిమిషాల పాటు మ్యాచ్ జరగగా, తొలి సెట్‌లో ఇద్దరు ప్లేయర్లు హోరాహోరీగా తలపడ్డారు.
అయితే రెండో సెట్‌లో పూర్తి ఆధిపత్యం చూపెట్టిన సబలెంక విజేతగా నిలిచింది. మ్యాచ్ మొత్తంలో 7 ఏస్‌లు, 3 డబుల్ ఫాల్ట్స్ చేసిన సబలెంక.. పెగులా సర్వీస్‌లో ఎక్కువ పాయింట్లు రాబట్టింది. 8 బ్రేక్ పాయింట్లలో మూడింటిని కాచుకుంది. 29 విన్నర్లు, 22 అన్‌ఫోర్స్‌డ్ ఎర్రర్స్ చేసింది. 4 ఏస్‌లు కొట్టిన పెగులా ఒక్క డబుల్ ఫాల్ట్ కూడా చేయలేదు.
అయితే తన సర్వీస్‌లో ఎక్కువ పాయింట్లు చేజార్చుకోవడం మైనస్‌గా మారింది. 12 విన్నర్లు, 14 అన్‌ఫోర్స్‌డ్ ఎర్రర్స్ చేసింది. 99 వారాల పాటు వరుసగా డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ ప్లేస్‌లో ఉన్న సబలెంకా.. సోమవారం టాప్ ర్యాంక్‌ను రిబకినాకు కోల్పోనుంది.
పోరాడిన రిబకినా..
రెండో సెమీస్‌లో రెండోసీడ్ రిబకినా 3–6, 6–4, 6–4తో నాలుగోసీడ్ కోకో గాఫ్ (అమెరికా)పై పోరాడి గెలిచింది. సీజన్ ఆరంభంలో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సబలెంకాను ఓడించిన రిబకినా.. ఆ తర్వాత నాలుగు గ్రాండ్‌స్లామ్స్‌లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. కానీ ఈ టోర్నీలో మాత్రం తొలి రౌండ్ నుంచి అద్భుతంగా ఆడింది. సెమీస్ చేరడంతో టాప్ ర్యాంక్‌ను కైవసం చేసుకుంది. 2 గంటలా 9 నిమిషాల మ్యాచ్‌లో గాఫ్ చివరి రెండు సెట్లలో కోలుకోవడానికి తీవ్రంగా శ్రమించింది. అయితే రిబకినా ఏమాత్రం చాన్స్ ఇవ్వలేదు.
బలమైన సర్వీస్‌లతో తొలి సెట్‌ను ప్రారంభించిన గాఫ్.. రిబకినాపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఏస్ కొట్టడంలో మంచి నైపుణ్యం చూపెట్టే రిబకినా ఒక్క ఏస్‌కే పరిమితం కాగా, గాఫ్ నాలుగు కొట్టింది. దాంతో 38 నిమిషాల్లోనే అమెరికన్ సెట్‌ను సొంతం చేసుకుంది. రెండో సెట్‌లో గాఫ్ 1–4తో వెనకబడినా.. 4–4తో స్కోరు సమం చేసింది. కానీ తర్వాతి రెండు గేమ్స్‌ను రిబకినా గెలుచుకుంది.
మూడో సెట్‌లో స్కోరు 5–3 వద్ద రిబకినా చేసిన మ్యాచ్ సర్వ్‌ను గాఫ్ అడ్డుకుంది. ఈ టైమ్‌లో అమెరికా మాజీ ప్రథమ మహిళ మిచెల్ ఒబామాతో సహా ప్రేక్షకులు ఆమెను ఉత్సాహపరిచినా ఫలితం దక్కలేదు. ఇక 1975 తర్వాత తొలిసారి యూఎస్ ఓపెన్‌లో నలుగురు టాప్ సీడ్ క్రీడాకారిణిలు సెమీస్ చేరడం ఇదే తొలిసారి.
