మైలార్ దేవ్ పల్లిలో విషాదం: ఫోన్ బిజీలో తల్లి.. వేడి నీళ్లు మీదపడి చిన్నారి మృతి

మైలార్ దేవ్ పల్లిలో విషాదం: ఫోన్ బిజీలో తల్లి.. వేడి నీళ్లు మీదపడి చిన్నారి మృతి

గండిపేట, వెలుగు: మైలార్‌‌దేవ్‌‌పల్లి పోలీస్‌‌స్టేషన్‌‌ పరిధిలో గురువారం వేడి నీళ్లు మీద పడడంతో నాలుగేళ్ల చిన్నారి కన్నుమూసింది. బకెట్​లో హీటర్​తో వేడి నీళ్లు పెట్టిన తల్లి ఫోన్​మాట్లాడుతూ.. పక్కకు వెళ్లగా, ఆడుకుంటూ వెళ్లిన పాప బకెట్​ను పట్టుకోగా ఈ ఘటన జరిగింది. మహబూబ్‌‌నగర్‌‌ జిల్లాకు చెందిన ఓ కుటుంబం కొద్ది కాలంగా ప్రగతినగర్‌‌లో ఉంటూ స్థానిక కంపెనీలో పని చేస్తోంది. వీరికి మానస(4) అనే కూతురు ఉంది. 

గురువారం రాత్రి పని ముగించుకుని వచ్చిన బాలిక తల్లి స్నానం చేయడానికి బకెట్‌‌లో వాటర్‌‌ హీటర్‌‌ పెట్టింది. అదే టైంలో ఆమెకు కాల్​రావడంతో మాట్లాడుతూ.. బయటికి వెళ్లింది. అక్కడే ఆడుకుంటున్న మానస వేడినీళ్ల బకెట్‌‌ ను పట్టుకుంది. దీంతో అందులోని నీళ్లు ఒలికి మీద పడడంతో తీవ్రంగా గాయపడింది. 

పాప ఏడుపు విని ఇంట్లోకి వచ్చిన తల్లి ఆ చిన్నారిని ఓ ప్రైవేట్​దవాఖానకు తరలించినా ప్రాణాలు దక్కలేదు. బాలిక మృతదేహాన్ని గ్రామానికి తీసుకువెళ్లినట్టు సమాచారం. దీనిపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని మైలార్‌‌దేవ్‌‌పల్లి ఇన్‌‌స్పెక్టర్‌‌ శ్రీనివాస్‌‌ తెలిపారు.