మోఖి (చైనా): డిఫెండింగ్ చాంపియన్ ఇండియా మెన్స్ జట్టు.. జూనియర్ ఆసియా కప్‌లో వరుసగా నాలుగోసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఇండియా 3–1తో మలేసియాపై గెలిచింది. కెప్టెన్ అన్మోల్ ఎక్కా (16, 54వ నిమిషం ) రెండు పెనాల్టీలను గోల్స్‌గా మలిచాడు.
ఫలితంగా ఈ టోర్నీలో తన గోల్స్ సంఖ్యను 16కు పెంచుకుని అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్ల జాబితాలో టాప్ ప్లేస్‌ను మరింత పటిష్టం చేసుకున్నాడు. సుఖ్విందర్ (51వ ని) మరో గోల్ అందించాడు. మ్యాచ్ ఆరంభం నుంచే ఇండియా ప్లేయర్లు దూకుడుగా ఆడారు.
డీప్ డిఫెన్స్ నుంచి వచ్చిన లాంగ్ బాల్స్‌ను అజిత్ యాదవ్ రెండు నిమిషాల్లోనే రెండు గోల్స్ చేసేందుకు ప్రయత్నించాడు. ఆ వెంటనే మూడు పెనాల్టీలు లభించాయి. కానీ మలేసియా గోల్ కీపర్ అదిబ్ అడ్డుకున్నాడు. 17వ నిమిషంలో మలేసియా కొట్టిన గోల్‌ను కీపర్ వివేక్ లక్రా నిలువరించాడు.
36వ నిమిషంలో మన్‌మీత్ సింగ్ రాయ్‌కు ఎల్లో కార్డు రావడంతో ఇండియా పది మందితోనే ఆడింది. 41వ నిమిషంలో ప్రభ్‌దీప్ సింగ్ ఎల్లో కార్డు వచ్చింది. ఆట ముగియడానికి కేవలం 24 సెకన్లు మిగిలి ఉండగా, మలేషియా తమ ఎనిమిదవ పెనాల్టీ కార్నర్‌ను సాధించింది. చివరకు ఎం. రాహుల్ ద్వారా కన్సొలేషన్ గోల్ నమోదు చేసింది.
