న్యూఢిల్లీ: బేస్‌బాల్ క్రీడకు ప్రసిద్ధి చెందిన జపాన్‌లో క్రికెట్ విస్తరణకు ఇండియాతో జరగనున్న చారిత్రక టీ20 మ్యాచ్ గొప్ప వేదిక కానుందని ఆ దేశ కెప్టెన్ కెండెల్ కడోవాకి- ఫ్లెమింగ్ అభిప్రాయపడ్డాడు. ఆసియా క్రీడలకు ముందు ఇండియాతో తలపడటం తమకు దక్కిన అరుదైన అవకాశమన్నాడు.
‘మా దేశంలో బేస్‌బాల్ ఎక్కువగా ఆడతారు. క్రికెట్‌కు ఆదరణ కాస్త తక్కువే. అయితే ఈ రెండు క్రీడల మధ్య హ్యాండ్, ఐ కో అర్డినేషన్, క్రమశిక్షణ వంటి అంశాల్లో చాలా పోలికలు ఉన్నాయి. భవిష్యత్‌లో జపాన్ నుంచి కూడా గొప్ప క్రికెటర్లు వస్తారు.
ఈ మ్యాచ్ ద్వారా చిన్నారులు క్రికెట్ వైపు ఆకర్షితులవుతారు’ అని కెండెల్ పేర్కొన్నాడు. ఈ మ్యాచ్ కోసం తాము ఉత్సాహంగా ఎదురుచూస్తున్నామన్నాడు. జట్టుగా తాము ఏం చేయగలమో నిరూపించుకోవడమే ప్రధాన లక్ష్యమన్నాడు.
టోక్యో, ఒసాకా వంటి నగారాల్లో మైదానాలు, మౌలిక వసతుల కొరత క్రికెట్ అభివృద్ధికి ప్రధాన సవాలుగా మారిందని ఆల్‌రౌండర్ చార్లీ హారాహింజే అన్నాడు. నేపాల్, అఫ్గానిస్తాన్ తరహాలో జపాన్‌లోనూ క్రికెట్ బలపడేందుకు ఈ మ్యాచ్ తొలి అడుగు కావాలని ఆశాభావం వ్యక్తం చేశాడు.
