హైదరాబాద్, వెలుగు: అమెరికా, చైనా తరహాలో భారత్ సూపర్ పవర్‌గా ఎదగాలంటే దేశంలో కుల నిర్మూలన జరగాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సీతారాం ఏచూరి వర్ధంతి సభలో ఆయన మాట్లాడారు. దేశాభివృద్ధికి, విప్లవోద్యమానికి కులమే ప్రధాన అడ్డంకిగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.
పెట్టుబడిదారులు చౌకగా శ్రమను దోచుకోవడానికి, ప్రజలను ఐక్యం కాకుండా విడదీయడానికి పాలకవర్గాలు కుల వ్యవస్థను ఆయుధంగా వాడుకుంటున్నాయని మండిపడ్డారు. పుట్టుకతోనే శ్రామికులను చిన్నచూపు చూసే కులవ్యవస్థను అంతమొందించేందుకు పోరాటాలు జరగాలన్నారు. బీజేపీ ప్రభుత్వం మతోన్మాద శక్తులను ప్రోత్సహిస్తూ దేశాన్ని వెనుకకు నెట్టేయాలని చూస్తోందని విమర్శించారు.
కుల, ఆర్థిక పోరాటాలు రెండూ జమిలిగా సాగాలని పిలుపునిచ్చారు. మార్పు ప్రతి కుటుంబం నుంచే మొదలుకావాలని, కులాంతర వివాహాలు పెరిగినప్పుడే కులరహిత సమాజం సాధ్యమవుతుందని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ప్రభాకర్, వెంకటేష్ పాల్గొన్నారు.
