డేటా సెంటర్లు లాభమా? భారమా?..అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల భిన్న వాదనలు 

డేటా సెంటర్లు లాభమా? భారమా?..అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల భిన్న వాదనలు 
  • కొత్త ఉద్యోగాలు రావడం లేదన్న పాల్వాయి హరీశ్ బాబు 
  • డేటా సెంటర్లను ఆదిలాబాద్‌కు మళ్లించాలన్న పాయల్ శంకర్

హైదరాబాద్, వెలుగు: శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో రాష్ట్రంలో డేటా సెంటర్ల ఏర్పాటు, వాటి ద్వారా చేకూరే ప్రయోజనాలపై ఆసక్తికర చర్చ జరిగింది. తెలంగాణకు గ్లోబల్ టెక్ దిగ్గజాల నుంచి భారీ ఎత్తున పెట్టుబడులు వెల్లువెత్తుతున్న వేళ, ఇవి రాష్ట్ర భవిష్యత్తుకు నిజంగా లాభదాయకమా? లేక వనరులను హరించే భారమా అన్న అంశంపై ఒకే పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల నుంచి భిన్న వాదనలు వ్యక్తమయ్యాయి. బీజేపీ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, పాల్వాయి హరీశ్ బాబు సభలో లేవనెత్తిన అంశాలు కొత్త చర్చకు తెరలేపాయి.

ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. హైటెక్ పరిశ్రమల విస్తరణను రాజధానికే పరిమితం చేయకుండా ఉత్తర తెలంగాణ వైపు మళ్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో విస్తారమైన ప్రభుత్వ భూములు నిరుపయోగంగా ఉండటంతో పాటు డేటా సెంటర్ల నిర్వహణకు అత్యంత కీలకమైన పుష్కల నీటి వనరులు, అనుకూలమైన శీతల వాతావరణ పరిస్థితులు ఉన్నాయని వివరించారు. అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు తెలంగాణలో డేటా సెంటర్ల ఏర్పాటుకు క్యూ కడుతున్న తరుణంలో, ప్రభుత్వం చొరవ తీసుకుని ఆ కంపెనీలను ఆదిలాబాద్ వైపు మళ్లించేలా ప్రోత్సాహకాలు అందించాలని కోరారు.

మరోవైపు సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీశ్ బాబు.. డేటా సెంటర్ల ఏర్పాటు వల్ల ఒనగూరే ప్రయోజనాలపై పూర్తి భిన్నమైన, తీవ్ర ఆందోళనకర విశ్లేషణను సభ ముందుంచారు. రాష్ట్రానికి టీసీఎస్ హైపర్‌‌వాల్ట్ వంటి బడా సంస్థల ద్వారా సుమారు రూ. 1.50 లక్షల కోట్ల మేర భారీ పెట్టుబడులు వస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో కొత్త ఉద్యోగాలు రావడం లేదన్నారు. రూ. లక్షల కోట్ల పెట్టుబడులు వెచ్చించినా కనీసం 10 వేల నుంచి 15 వేల ఉద్యోగాలు కూడా లభించకపోవడం తీవ్ర నిరాశ కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

డేటా సెంటర్ల నిర్వహణకు నిరంతరాయంగా భారీగా విద్యుత్ అవసరమవుతుందని, ఇది రాష్ట్ర విద్యుత్ గ్రిడ్‌‌పై పెనుభారంగా మారుతుందని హెచ్చరించారు. భారీ ఎత్తున భూములు, రాయితీలతో కూడిన విద్యుత్‌‌ను పొందుతున్న ఈ డేటా సెంటర్లు స్థానిక ఉపాధికి పెద్దగా దోహదపడటం లేదని పేర్కొన్నారు.  తక్కువ పెట్టుబడితో ఎక్కువ సంఖ్యలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు కొలువులు కల్పించే సాఫ్ట్‌‌వేర్ కంపెనీలకే ప్రభుత్వం పెద్దపీట వేయాలని, డేటా సెంటర్లపై అనుసరిస్తున్న విధానాలను పునఃసమీక్షించాలని కోరారు.