డిజిటల్ క్రాప్ సర్వేలో లోపాలకు చెక్..ఆన్లైన్లో పంట నమోదుతో రైతుల మొబైల్కు మెసేజ్

డిజిటల్ క్రాప్ సర్వేలో లోపాలకు చెక్..ఆన్లైన్లో పంట నమోదుతో  రైతుల మొబైల్కు మెసేజ్
  • తప్పులుంటే ఏఈవోలను సంప్రదించాలని సూచన
  • 72 గంటల్లోగా సవరణలకు అవకాశం

మంచిర్యాల, వెలుగు : డిజిటల్​క్రాప్​సర్వే (డీసీఎస్​)లో లోపాలను నివారించడానికి ప్రభుత్వం ఈ ఏడాది నుంచి కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. వలంటీర్లు ఆన్​లైన్​లో పంట నమోదు చేయగానే సంబంధిత రైతు ఫోన్​కు మెసేజ్ వచ్చేలా సాఫ్ట్​వేర్​లో మార్పులు చేసింది. ఇప్పటివరకు కొందరు వలంటీర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పంట వివరాలను తప్పుగా నమోదు చేస్తున్నారు. దీనికి తోడు ఓ పంట వేస్తే మరో పంట వేసినట్లుగా నమోదు అవుతుండడంతో పంటను అమ్ముకునే సమయంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు తీసుకొచ్చిన ఈ కొత్త విధానంతో పంట వివరాల నమోదు పూర్తి కాగానే రైతులకు మెసేజ్ వస్తుంది.

72 గంటల్లోగా సవరణలకు చాన్స్

డిజిటల్​క్రాప్​సర్వేలో ముందుగా వలంటీర్లు నమోదు చేసిన వివరాలు ఏఈవోల లాగిన్​కు వస్తాయి. వారు అప్రూవల్ చేస్తే ఆన్​లైన్​లో ఎంట్రీ అవుతాయి. ఒకసారి ఏఈవోలు అప్రూవల్​ చేసిన తర్వాత వాటిని మార్చడం వీలు కాదు. కానీ రైతులు డీసీఎస్​లో తప్పుడు వివరాలు నమోదైనట్టు భావిస్తే వాటిని 72 గంటల్లోగా సవరించుకునే అవకాశం ఉంది. తమ మొబైల్​కు వచ్చిన మెసేజ్ ఆధారంగా నిర్దేశిత గడువులోగా సంబంధిత ఏఈవోను సంప్రదించి సరైన వివరాలు తెలియజేయాలి. ఏఈవోలు తప్పులను సవరించి అప్రూవల్​చేస్తే ఆన్​లైన్​లో ఎంట్రీ అవుతుంది. రైతుకు సంబంధించిన సర్వే నంబర్లతో పాటు అక్షాంశ, రేఖాంశాలు, పంట ఫొటోలు సైతం నమోదవుతాయి. 

పంట అమ్మకాల్లో డీసీఎస్ కీలకం

గ్రామాల వారీగా రైతులు ఏ రకమైన పంటలను ఎంత విస్తీర్ణంలో సాగు చేశారన్న వివరాల ఆధారంగా ప్రభుత్వం పంటల ప్రణాళికలను రూపొందించుకోవడానికి డిజిటల్​క్రాప్​సర్వేను ప్రారంభించింది. విత్తనాలు, ఎరువులు ఎంతమేరకు అవసరం అవుతాయి, పంట దిగుబడి ఎంత వస్తుంది, ఎన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలనే కచ్చితమైన నిర్ధారణకు రావడానికి ఇది ఉపయోగపడుతుంది. తద్వారా పత్తి, వరి, మక్కలతో పాటు ఇతర వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. 

రాష్ట్ర ప్రభుత్వం ఈ వానాకాలం సీజన్​నుంచి ఏడు రకాల సన్నాలకు మాత్రమే బోనస్​ ప్రకటించిన నేపథ్యంలో పంటల కొనుగోళ్లలో డిజిటల్​క్రాప్​ సర్వే కీలకంగా మారనుంది. మంచిర్యాల జిల్లా  వేమనపల్లి మండలంలోని కొత్తూర్, దస్నాపూర్​గ్రామాలకు చెందిన రైతులు గత యాసంగిలో  2,500 ఎకరాలకు మించి వరిపంట సాగు చేసినప్పటికీ క్రాప్​బుకింగ్​లో ఆ వివరాలను నమోదు చేయలేదు.  దీంతో తాము పండించిన వడ్లను అమ్ముకోవడానికి నానా పాట్లు పడ్డారు. ఇప్పుడు ఈ కొత్త విధానంతో ఇలాంటి సమస్యలన్నీ పరిష్కారం కానున్నాయి.