ఈజీ మనికోసం.. దొంగలుగా మారిననలుగురు అన్నదమ్ములు

ఈజీ మనికోసం.. దొంగలుగా మారిననలుగురు అన్నదమ్ములు
  • ట్రాన్స్ ఫార్మర్ లోని కాపర్ కాయిల్స్ లక్ష్యంగా చోరీలు
  • ముగ్గురిని అరెస్ట్ చేసిన కామారెడ్డి పోలీసులు, పరారీలో మరొకరు

కామారెడ్డి, వెలుగు : జల్సాలకు అలవాటుపడిన నలుగురు అన్నదమ్ములు ఈజీ మనీ కోసం దొంగలుగా అవతారమెత్తారు. ట్రాన్స్ ఫార్మర్ల లో కాపర్ కాయిల్స్ చోరీ చేస్తున్న వీరిని కామారెడ్డి పోలీసులు పట్టుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ రాజేశ్ చంద్ర శుక్రవారం మీడియాకు వెల్లడించారు. హైదరాబాద్ మేడ్చల్ కు చెందిన బల్జీర్ సింగ్, రూప్ సింగ్, లకన్ చతుర్ సింగ్, మరో వ్యక్తి అన్నదమ్ములు. 

జల్సాలకు అలవాటు పడిన ఈ నలుగురు ఈజీగా డబ్బులు సంపాదించేందుకు చోరీ బాట పట్టారు. ఇందులో భాగంగా కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో 52 కరెంటు ట్రాన్స్ ఫార్మర్ల ను ధ్వంసం చేసి కాపర్ కాయిల్స్, వైర్లను ఎత్తుకెళ్లారు. ఇటీవల భిక్కనూరు, రాజంపేట మండలాల్లో ట్రాన్స్ ఫార్మర్లలో చోరీ చేయడంతో విద్యుత్ శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్ ఆధ్వర్యంలో స్పెషల్ టీం ఏర్పాటు చేశారు. 

ఈ క్రమంలో బల్జీర్ సింగ్, రూప్ సింగ్, లకన్ చతుర్ సింగ్ కామారెడ్డికి వస్తుండగా.. భిక్కనూరు మండలంలో వారిని పట్టుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకోగా మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని ఎస్పీ వెల్లడించారు. నిందితుల నుంచి 30 కిలోల కాపర్ వైరు, ఓ వెహికల్, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితులను పట్టుకున్న డీఎస్పీ మధుసూదన్, సీఐలు నరేశ్, సంతోష్, ఎస్సైలు అనిల్, మహేశ్ ను ఎస్పీ అభినందించారు.