బీర్కూర్ డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపు

బీర్కూర్ డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపు
  • లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేసిన అధికారులు
  •       అనర్హులకు కేటాయించారని  బీఆర్​ఎస్ నేతల ఆందోళన

బీర్కూర్, వెలుగు: కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను శుక్రవారం లాటరీ పద్దతి ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి కేటాయించారు. బీర్కూర్​లోని  రైతు వేదికలో బాన్సువాడ ఆర్డీవో రవీందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, తహసీల్దార్ సవాయి సింగ్ ఆధ్వర్యంలో పోలీసుల భారీ బందోబస్తు మధ్య లాటరీ ప్రక్రియ నిర్వహించారు. మొత్తం 36 డబుల్ ఇండ్లు ఉండగా వీటి కోసం 500 వరకు దరఖాస్తులు వచ్చాయని ఆఫీసర్లు తెలిపారు. 

వీటిలో అగ్ని ప్రమాద బాధితులకు మూడు ఇండ్లు ఇవ్వగా మిగతా 500 దరఖాస్తుల్లో 47మందిని అర్హులుగా గుర్తించి 33 ఇండ్ల కోసం లాటరీ నిర్వహించారు. అయితే ఎంపికపై కొందరు పేదలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థికంగా బలంగా ఉన్నవారికి, ఇండ్లు ఉన్న వారికి కూడా ఇచ్చారని ఆరోపిస్తూ బీఆర్​ఎస్​నేతలు ఆందోళనకు దిగారు. ఎంపీడీఓ కార్యాలయం ఎదుట గ్రామ సర్పంచ్ ధర్మతేజ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అనర్హుల ఎంపికపై సమగ్ర విచారణ జరిపి, నిజమైన అర్హులను గుర్తించాలని డిమాండ్​చేశారు.