హనుమకొండ సిటీ, వెలుగు: ఎర్రవెల్లి ఫాంహౌజ్ ప్రాంతంలో దళితులు నడిచిన నేలను బీఆర్ఎస్ నేతలు పసుపునీళ్లతో శుద్ధి చేయడం అనాగరిక చర్య అని టీపీసీసీ అధికార ప్రతినిధి డా.కోటూరి మానవతారాయ్ అన్నారు. హనుమకొండలోని డీసీసీ భవన్‌లో హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో మానవతారాయ్ మాట్లాడారు. ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రసంగించిన వేదికను బీజేపీ శుద్ధి చేసి దళిత నాయకుడిని ఘోరంగా అవమానించారన్నారు.
దళిత స్పీకర్‌ను అవమానించినందుకు దళితులు కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర డప్పు కొట్టి శైలిలో నిరసన తెలిపితే ఆ ప్రాంతాన్ని బీఆర్ఎస్ నేతలు పసుపునీళ్లతో శుద్ధి చేయడం అంతరించిపోయిన అంటరానితనాన్ని ప్రోత్సహించడమే అవుతుందన్నారు. సమావేశంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ ఆయూబ్, లీడర్లు పెరుమాండ్ల రామకృష్ణ, బందెల భద్రయ్య, ఆరూరి సాంబయ్య, వీసం సురేందర్ రెడ్డి, మహమ్మద్ రహమతుల్లా పాల్గొన్నారు.
