- ఇప్పటికే సర్వే పూర్తి చేసిన ఆఫీసర్లు
- ప్రభుత్వానికి నివేదిక పంపిన ఆఫీసర్లు
- ప్రభుత్వ ఆమోదం తర్వాత స్పోర్ట్స్ స్కూల్‌కు పర్మినెంట్ బిల్డింగ్
హనుమకొండ, వెలుగు: వరంగల్ స్పోర్ట్స్ స్కూల్ నిర్మాణానికి స్థలం ఖరారైంది. రింగ్ రోడ్డును ఆనుకుని భీమారం శివారులో స్పోర్ట్స్ స్కూల్‌కు పర్మినెంట్ బిల్డింగ్ నిర్మించేందుకు ఆఫీసర్లు స్థలాన్ని గుర్తించారు. క్రీడా స్కూల్ మంజూరు చేసి ఏడాదైనా సరైన స్థలం కోసం ఇన్నాళ్లు ఆఫీసర్లు వెతుకుతున్నారు. చివరకు హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండల పరిధి భీమారం శివారులోని 22 ఎకరాలు గుర్తించారు. ఈ మేరకు రెవెన్యూ ఆఫీసర్లు సర్వే కూడా పూర్తి చేసి, జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. ప్రభుత్వం ఆమోదం తర్వాత ఈ స్థలంలో స్పోర్ట్స్ స్కూల్ నిర్మాణానికి పునాదులు పడనున్నాయి.
ఉనికిచెర్ల టు భీమారం
వరంగల్‌ను స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్ స్టేడియంతో పాటు స్పోర్ట్స్ స్కూల్‌ను మంజూరు చేసింది. గతేడాది జూలై 20న సిటీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం స్టేడియంతో పాటు స్పోర్ట్స్ స్కూల్ శాంక్షన్ చేసింది. దీంతో గతేడాది నవంబర్‌లో స్పోర్ట్స్ స్కూల్‌ను హనుమకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం బాయ్స్ హాస్టల్ బిల్డింగ్‌లో టెంపరరీగా ఓపెన్ చేసి తరగతులు నిర్వహిస్తున్నారు.
అయితే వరంగల్ రింగ్ రోడ్డును ఆనుకుని ధర్మసాగర్ మండలం ఉనికిచెర్ల శివారులోని సర్వే నంబర్ 325లోని 30 ఎకరాల్లో క్రికెట్ స్టేడియం, మరో 20 ఎకరాల్లో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఆ తరువాత అభ్యంతరాలు, సాధ్యాసాధ్యాలను పరిగణనలోకి తీసుకుని దేవన్నపేట, మడిపల్లి సమీపంలోని 'కుడా' మా సిటీ సమీపంలో నిర్మించాలని భావించారు.
కానీ అక్కడా అభ్యంతరాలు రావడంతో స్పోర్ట్స్ స్కూల్ బిల్డింగ్ నిర్మాణాన్ని వరంగల్ రింగ్ రోడ్డుకు సమీపంలోనే ఉన్న భీమారం శివారుకు షిఫ్ట్ చేశారు. ప్రస్తుతం భీమారం శివారులో స్థలాన్ని ఫైనల్ చేశారు. కాగా వరంగల్ కు మంజూరైన క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ఇంకా స్థలం ఖరారు కాలేదని అధికారులు చెబుతున్నారు.
22 ఎకరాల్లో పర్మినెంట్ బిల్డింగ్
భీమారం శివారులోని పలివేల్పుల గ్రామానికి దగ్గర్లో సర్వే నంబర్70లో మొత్తంగా 36.28 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. ఇందులో గతంలోనే కేజీబీవీ కోసం 10 ఎకరాలు, మరో 4 ఎకరాలను చేప పిల్లల ఉత్పత్తి కేంద్రానికి అప్పగించారు. దీంతో 14 ఎకరాలు పోనూ మిగతా 22.28 ఎకరాలు స్పోర్ట్స్ స్కూల్ నిర్మాణానికి అనుకూలంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు కొద్దిరోజుల కింద సర్వే పూర్తి చేశారు.
ఇటీవల జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, స్పోర్ట్స్, రెవెన్యూ ఆఫీసర్లు కూడా స్థలాన్ని పరిశీలించారు. కాగా ఈ స్థలం ఇటు వరంగల్ రింగ్ రోడ్డు(ఎన్‌హెచ్ -163 బైపాస్), కరీంనగర్–-వరంగల్ (ఎన్‌హెచ్-563)కు అతి దగ్గరలో ఉంది. ఈ హైవేలతో రెండు వైపులా ఇక్కడికి రాకపోకలు సులువుగా సాగే అవకాశం ఉంది. దాదాపు రూ.150 కోట్లకు పైగా నిధులతో ఈ స్పోర్ట్స్ స్కూల్ నిర్మించనుండగా.. ల్యాండ్, డీపీఆర్ ఫైనల్ అయితే తొందర్లోనే వరంగల్ రింగ్ రోడ్డును ఆనుకుని స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు కానుంది.
