న్యూఢిల్లీ: ఇండియా స్టార్ ప్లేయర్ యూకీ బాంబ్రీ.. కొరియాతో జరగనున్న డేవిస్ కప్ టోర్నీలో ఆడటంపై సందిగ్ధత నెలకొంది. యూఎస్ ఓపెన్ మెయిన్ డ్రా మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రాక్టీస్‌లో యూకీ కాలి కండరాల నొప్పికి గురయ్యాడు.
దాంతో గురువారం రాత్రి సియోల్‌కు బయలుదేరిన ఇండియా టీమ్‌తో అతను వెళ్లలేదు. ఈ నెలాఖరులో జరగనున్న ఈ మ్యాచ్‌లో గెలిస్తే.. 8 జట్లతో కూడిన ఎలైట్ డేవిస్ కప్ ఫైనల్స్‌లో ఇండియాకు స్థానం లభిస్తుంది. అయితే గాయం తీవ్రత తక్కువగా ఉందని యూకీ స్పష్టం చేశాడు.
‘ఇంకా నొప్పి ఉంది. డేవిస్ కప్ మ్యాచ్‌ల వరకు కోలుకునేలా చేసేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు. గాయంపై రోజువారి పర్యవేక్షణ కొనసాగుతోంది. ఆసియా క్రీడల్లో పాల్గొనడానికి ఎలాంటి ఇబ్బంది లేదు’ అని యూకీ పేర్కొన్నాడు. ఒకవేళ యూకీ అందుబాటులో లేకపోతే అతని ప్లేస్‌లో అనిరుధ్ చంద్రశేఖర్‌ను జట్టులోకి తీసుకోనున్నారు.
