- పోక్సో కేసు నమోదు.. వ్యక్తి అరెస్టు
లక్సెట్టిపేట, వెలుగు: తన కూతురికి ఆరోగ్యం బాగాలేదని, పూజ చేయిస్తే తగ్గిపోతుందని అపోహతో తల్లి ఓ వ్యక్తి వద్దకు తీసుకెళ్తే అతడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో అతడిపై పోక్సో కేసు నమోదైంది. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో జరిగిన ఘటన వివరాలను సీఐ రమణమూర్తి, ఎస్సై గోపతి సురేశ్ శుక్రవారం సాయంత్రం వెల్లడించారు. జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన ఓ బాలికకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో.. లక్సెట్టిపేటలోని గోదావరి రోడ్డులో ఉండే సతీశ్మంత్రాల ద్వారా నయం చేస్తాడని తెలుసుకొని ఈ నెల 8న అతడి వద్దకు తీసుకొచ్చింది.
అయితే పూజల పేరుతో ఆ బాలికను ఒంటరిగా తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడు. లైంగికంగా వేధించాడు. విషయాన్ని తల్లిదండ్రులకు చెప్తే చంపుతానని బెదిరించడంతో బాలిక భయపడిపోయింది. ధైర్యం చేసి విషయాన్ని గురువారం కుటుంబసభ్యులకు చెప్పడంతో వారు లక్సెట్టిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి, అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు.
