హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ‘చేయూత’ సామాజిక భద్రతా పెన్షన్ల కింద ఒంటరి మహిళలకు ఆర్థిక సాయం మంజూరు చేసే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం మరింత సులభతరం చేసింది. భర్త నుంచి వేరుపడిన కాలానికి సంబంధించి సరైన పత్రాలు లేని ఒంటరి మహిళల దరఖాస్తులపై స్థానిక విచారణ జరిపేందుకు క్షేత్రస్థాయి అధికారులకు సర్కార్ అధికారాలను విస్తరించింది.
ఇప్పటివరకు ఈ విచారణ అధికారం కేవలం తహసీల్దార్లకు మాత్రమే ఉండగా.. ఇకపై తహసీల్దార్లతో పాటు ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లకు కూడా స్థానిక విచారణ జరిపే అధికారం కల్పిస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ జీవోను జారీ చేసింది.
