- అక్రమ దత్తతను నివారించేలా ఢిల్లీలో కారా వర్క్‌షాప్
న్యూఢిల్లీ, వెలుగు: పిల్లల దత్తత విషయంలో సత్వర మార్గాలను అనుసరించొద్దని సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ (కారా) సీఈఓ భావనా సక్సేనా సూచించారు. ఇలాంటి మార్గాల్లో దత్తత తీసుకుంటే పిల్లలతోపాటు తల్లిదండ్రులు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు.
అక్రమ దత్తతను నివారించడం, చట్టబద్ధ దత్తతపై అవగాహన కల్పించేందుకు శుక్రవారం ఢిల్లీ సెక్రటేరియెట్‌లో కారా వర్క్‌షాప్ నిర్వహించింది. ‘చట్టబద్ధమైన దత్తత.. సురక్షిత బాల్యం.. భద్రమైన భవిష్యత్’ థీమ్‌తో జరిగిన కార్యక్రమంలో ఢిల్లీ మహిళా, శిశు అభివృద్ధి శాఖ సెక్రటరీ రష్మీ సింగ్, పోలీసు, బాలల సంరక్షణ, దత్తత, ఆరోగ్య శాఖల అధికారులు, దాదాపు 200 మంది పాల్గొన్నారు.
వర్క్‌షాప్‌లో చట్టబద్ధ దత్తతపై రూపొందించిన కల్పిత చిత్రాన్ని విడుదల చేశారు. అధికారిక ప్రక్రియను అనుసరించడం, అక్రమ దత్తత వల్ల ఎదురయ్యే ప్రమాదాలను వివరించారు. హాస్పిటల్స్ నుంచి పోలీసుల వరకు, బాలల సంక్షేమ సంఘాలు, అంగన్‌వాడీ కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. దత్తత ప్రక్రియలో ప్రతి బిడ్డ శ్రేయస్సు, హక్కులు కాపాడడమే ముఖ్యమని పేర్కొన్నారు.
