- ప్రపంచ సగటు కంటే రెట్టింపు వేగంతో దూసుకుపోతున్నది: మోదీ
- ఈ దేశాల ఉమ్మడి జీడీపీ దాదాపు 4.5 రెట్లు పెరిగింది
- బ్రిక్స్ దేశాలు కొత్త ఇన్నోవేషన్ కేంద్రాలుగా మారుతున్నయ్
- 18వ బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్ లీడర్స్ సెషన్‌లో ప్రధాని
- ఢిల్లీకి చేరుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియాన్
- ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు.. నేడు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ రాక
న్యూఢిల్లీ:బ్రిక్స్ దేశాలు ప్రపంచ జనాభాలో 50 శాతం, అంతర్జాతీయ జీడీపీలో 40 శాతం, ప్రపంచ వాణిజ్యంలో 25 శాతానికి పైగా వాటాను కలిగి ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రపంచ జీడీపీ 2.5 రెట్లు పెరిగితే.. బ్రిక్స్ దేశాల ఉమ్మడి జీడీపీ దాదాపు 4.5 రెట్లు పెరిగిందని, ప్రపంచ సగటు కంటే రెట్టింపు వేగంతో బ్రిక్స్ ఆర్థిక వ్యవస్థ విస్తరిస్తోందని వివరించారు. సముద్రయాన స్వేచ్ఛ, నావికుల భద్రత సురక్షితమైన ప్రపంచ వాణిజ్యానికి ఎంతో కీలకమని స్పష్టం చేశారు.
స్వేచ్ఛాయుత నౌకాయానానికి భారత్ కట్టుబడి ఉంటుందని తెలిపారు. బ్రిక్స్ దేశాలు కొత్త ఆవిష్కరణలకు కేంద్రాలుగా మారాయని చెప్పారు. శుక్రవారం ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన18వ బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్ లీడర్స్ సెషన్‌లో మోదీ ప్రసంగించారు. వివిధ ప్రాంతాల్లో భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో సముద్ర మార్గాల పరిరక్షణపై ప్రధాని గట్టిగా గళమెత్తారు. బ్రిక్స్ దేశాల మధ్య ఉన్న టాప్-10 వాణిజ్య అడ్డంకులను గుర్తించి, వాటిని తొలగించడానికి ఒక నివేదికను సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు.
అంతర్జాతీయ సవాళ్లకు భారత్ పరిష్కార వేదిక
ప్రపంచ దేశాలు వాణిజ్య గోడలు కడుతుంటే, భారత్ మాత్రం ఆర్థిక వృద్ధికి వంతెనలు నిర్మిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. భారత ఆర్థిక వృద్ధిలో మహిళా పారిశ్రామికవేత్తలు కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. భారత్‌లో జరిగిన ‘బ్రిక్స్ విమెన్ బిజినెస్ అలయన్స్’ సమావేశంలో దాదాపు 200 మంది మహిళా ప్రతినిధులు పాల్గొనడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. 2 లక్షలకు పైగా స్టార్టప్‌లు, 120కిపైగా యూనికార్న్‌లతో అంతర్జాతీయ సవాళ్లకు భారత్ పరిష్కార వేదికగా అవతరించిందని ప్రధాని పేర్కొన్నారు.
పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా భారత్-–రష్యా దేశాల మధ్య చిరకాల మైత్రి మరోసారి బలపడింది. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు 3 రోజుల పర్యటన నిమిత్తం భారత్ చేరుకున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఢిల్లీలోని భారత్ మండపంలో ప్రధాని మోదీ ఉన్నతస్థాయి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. భేటీకి ముందు ఇరువురు నేతలు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఈ ఏడాది వీరిద్దరూ ముఖాముఖి కలుసుకోవడం ఇది రెండోసారి.
ఈ ద్వైపాక్షిక సమావేశంలో రాజకీయం, ఆర్థికం, రక్షణ, ఇంధనం, అంతరిక్ష పరిశోధనలు, స్కిల్ మొబిలిటీసహా ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాల బలోపేతంపై విస్తృతంగా చర్చించారు. ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు, పశ్చిమాసియా ఉద్రిక్తతలు, నల్లసముద్ర ప్రాంతంలోని సంక్షోభం వల్ల అంతర్జాతీయ సముద్ర వాణిజ్యం, భారతీయ నావికుల భద్రతపై పడుతున్న ప్రభావంపై డిస్కస్ చేశారు. రక్షణ ప్రాజెక్టుల పురోగతి, భవిష్యత్ కార్యాచరణ వీరి అజెండాలో ప్రధానంగా నిలిచాయి. అలాగే, భారత్-–రష్యా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి 100 బిలియన్ డాలర్లకు చేర్చాలని ఇరు దేశాల నేతలు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.
ఢిల్లీలో అడుగుపెట్టిన ఇరాన్ అధ్యక్షుడు
బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఢిల్లీకి చేరుకున్నారు. సుమారు ఎనిమిదేండ్ల తర్వాత ఇరాన్ దేశాధ్యక్షుడు భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాల మధ్య కొనసాగుతున్న తీవ్ర ఘర్షణలు మరింత విస్తరించే ప్రమాదం ఉన్న సమయంలో ఈ పర్యటన జరగడం అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నది.
నేడు, రేపు 18వ బ్రిక్స్ సదస్సు.. ప్రముఖుల రాక
భారత్ అధ్యక్షతన సెప్టెంబర్ 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరగనుంది. ఉక్రెయిన్ సంక్షోభం ప్రారంభమైన తర్వాత రష్యా వెలుపల పుతిన్ స్వయంగా హాజరవుతున్న తొలి బ్రిక్స్ సదస్సు ఇదే. ఉమ్మడి ప్రాధాన్యతలు, సభ్యదేశాల మధ్య పరస్పర సహకారం, అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై కీలక చర్చలు జరగనున్నాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్ పెజెష్కియాన్, దక్షిణాఫ్రికా ప్రెసిడెంట్ సిరిల్ రామఫోసాతోపాటు పలువురు ప్రపంచ నేతలకు విమానాశ్రయంలో కేంద్ర మంత్రులు ఘన స్వాగతం పలికారు. ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తాహ్ ఎల్-సిసి, ఉగాండా ఉపాధ్యక్షురాలు జెస్సికా అలూపో, నైజీరియా ఉపాధ్యక్షుడు కాషిమ్ షెట్టిమా కూడా ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. బ్రిక్స్ సమావేశాలకు ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్, న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ ప్రెసిడెంట్ దిల్మా రౌసెఫ్ తదితరులు హాజరుకానున్నారు.
పుతిన్‌కు ‘తిరుక్కురళ్’ బుక్ గిఫ్ట్..
భారతీయ విశిష్ట సంస్కృతికి ప్రతీకగా నిలిచే గొప్ప తమిళ కవి, తత్వవేత్త తిరువళ్లువర్ రచించిన ‘తిరుక్కురళ్’ గ్రంథ రష్యన్ అనువాద ప్రతిని పుతిన్‌కు ప్రధాని మోదీ కానుకగా అందించారు. ప్రాచీన తమిళ సాహిత్యంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ‘తిరుక్కురళ్’ను దాదాపు 2,000 నుంచి 2,500 సంవత్సరాల క్రితం తిరువళ్లువర్ రచించగా, ఇందులో నైతికత, ప్రేమ, సుపరిపాలన, మానవ ప్రవర్తన, వ్యవసాయంలాంటి సమస్త జీవన అంశాలను ప్రస్తావిస్తూ 133 అధ్యాయాల్లో 1,330 ద్విపదలను పొందుపరిచారు. అర్థవంతమైన, నైతిక జీవనానికి మార్గదర్శిగా నిలిచే ఈ గ్రంథం మానవ అస్తిత్వ విలువల బోధనలకు ప్రసిద్ధి పొందింది.
మరోసారి ఆకట్టుకున్న ‘కార్ప్లోమసీ’
ద్వైపాక్షిక సమావేశం ముగిసిన అనంతరం మోదీ, పుతిన్ ఇద్దరూ రష్యా అధ్యక్షుడి కారులో కలిసి ప్రయాణించారు. అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ ‘కార్ప్లొమసీ’ వీరిద్దరి మధ్య ఇది నాలుగోసారి కావడం విశేషం.‘కార్ప్లొమసీ’ అనేది కారు, డెమోక్రసీ కలయికతో ఏర్పడిన పదం. ఇద్దరు దేశాధినేతలు ఒకే కారులో ప్రయాణించడాన్ని ఇలా పిలుస్తారు. 2015లో రష్యా పర్యటన సందర్భంగా పుతిన్ కారులో మోదీ తొలిసారి ప్రయాణించారు. 2019లో ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం సమావేశాల సమయంలో, 2024 రష్యా పర్యటనలోనూ పుతిన్ కారులో మోదీ ఎక్కారు.
