వాషింగ్టన్: అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం మరోసారి జాతి వివక్ష వివాదంలో చిక్కుకుంది. వలసదారులపై కఠిన చర్యల్లో భాగంగా అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) విడుదల చేసిన ఇమ్మిగ్రేషన్ ప్రకటన దుమారం రేపుతోంది.
'ట్రాన్స్‌ఫార్మర్స్' సినిమా థీమ్‌తో రూపొందించిన ఈ పోస్టర్‌లో, తలపాగా ధరించిన వ్యక్తిని "మిస్టర్ సింగ్" అని సంబోధిస్తూ.. "మా రోడ్ల నుంచి తప్పుకోండి, మీకు డ్రైవింగ్ రాదు" అంటూ రోబో హెచ్చరిస్తున్నట్లు చూపించారు. అక్రమ వలసదారులు స్వచ్ఛందంగా దేశం విడిచిపోవాలని కోరుతున్న ట్రంప్ సర్కార్.. "సేఫ్ -డిపోర్ట్ ఆర్ ఫైండ్ అవుట్" అనే నినాదంతో ఈ క్యాంపెయిన్ చేపట్టింది.
ఇదే క్రమంలో కొందరు ట్రక్ డ్రైవర్లను ప్రస్తావిస్తూ మరో ఏఐ వీడియోను కూడా పోస్ట్ చేశారు. అయితే, దీనిపై హిందూ, సిక్కు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇలాంటి వివక్షాపూరిత పోస్టులు చేయడం సిగ్గుచేటని, దీనిపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశాయి.
