న్యూఢిల్లీ: ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీ విద్యార్థుల రెండు వారాల పోరాటం ఫలించింది. స్టూడెంట్ యూనియన్ ఎన్నికల పునరుద్ధరణతో పాటు విద్యార్థులు లేవనెత్తిన పలు కీలక డిమాండ్లకు యూనివర్శిటీ అంగీకరించింది. ఈ మేరకు సోమవారం (అక్టోబర్ 26) రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మహమ్మద్ మహతాబ్ ఆలం రిజ్వీ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. తమ డిమాండ్లకు వర్శిటీ మేనేజ్మెంట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో విద్యార్థులు నిరాహార దీక్షను విరమించారు.
విద్యార్థి సంఘం రాజ్యాంగానికి ఆమోదం లభించిన 15 రోజుల తర్వాత స్టూడెంట్ యూనియన్ ఎన్నికలు నిర్వహిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తామనే నిర్ధిష్టమైన తేదీని యూనివర్శిటీ ప్రకటించలేదు. ఆందోళన సమయంలో విద్యార్థులకు జారీ చేసిన సస్పెన్షన్ ఉత్తర్వులు, షోకాజ్ నోటీసులను కూడా వర్శిటీ రద్దు చేసింది. ఇక, శాంతియుతంగా నిరసన తెలుపుతోన్న విద్యా్ర్థులపై దాడి చేసిన భద్రతా సిబ్బందిపై విచారణకు ఆదేశించనున్నట్లు తెలిపింది.
విద్యార్థుల డిమాండ్లను అంగీకరించామని నిరాహార దీక్షను విరమించుకోవాలని విశ్వవిద్యాలయ యాజమాన్యం ప్రకటించినప్పటికీ జామియా మిలియా ఇస్లామియా గేట్ నెం. 7 వద్ద కొంతమంది విద్యార్థులు ఇంకా ఆందోళన కొనసాగిస్తున్నారు. విద్యార్థి సంఘ ఎన్నికలకు సంబంధించి వర్శిటీ జారీ చేసిన అధికారిక ఉత్తర్వులో నిర్దిష్ట తేదీని ప్రకటించలేదని వాదిస్తూ విద్యార్థులు ఆందోళన విరమించడానికి నిరాకరించారు. ఎన్నికల షెడ్యూల్ను స్పష్టంగా ప్రకటించే వరకు తమ నిరసనను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
►ALSO READ | తెలంగాణ అభ్యర్థనను మరోసారి పరిశీలిస్తం: తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు పెంపుపై మహారాష్ట్ర CM స్పందన
2006లో క్యాంపస్లో జరిగిన హింసాత్మక ఘటనల కారణంగా 'జామియా మిలియా ఇస్లామియా స్టూడెంట్స్ యూనియన్' (జేఎంఐఎస్ యూ)ను రద్దు చేశారు. దాదాపు రెండు దశాబ్దాలుగా ఎన్నికలు లేకపోవడంతో, స్టూడెంట్ యూనియన్ను వెంటనే పునరుద్ధరించాలని కోరుతూ అక్టోబర్ 12 నుంచి విద్యార్థులు ఆందోళనకు దిగారు. విద్యార్థుల నిరసనలతో క్యాంపస్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎట్టకేలకు విద్యార్థుల డిమాండ్లకు అంగీకరించిన వర్శిటీ.. స్టూడెంట్ యూనియన్ ఎన్నికల పునరుద్ధరణకు ఆమోదం తెలిపింది. దీంతో విద్యార్థులు ఆందోళనలు విరమించారు.
