తెలంగాణ అభ్యర్థనను మరోసారి పరిశీలిస్తం: తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు పెంపుపై మహారాష్ట్ర CM స్పందన

తెలంగాణ అభ్యర్థనను మరోసారి పరిశీలిస్తం: తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు పెంపుపై మహారాష్ట్ర CM స్పందన

ముంబై: తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ ఎత్తు పెంపునకు సహకరించాలన్న తెలంగాణ అభ్యర్థనపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సానుకూలంగా స్పందించారు. మహారాష్ట్రకు, తమ ప్రజలకు ఎలాంటి ప్రతికూల ప్రభావం లేకపోతే 148 మీటర్ల ఎత్తు ఒప్పందాన్ని పున: పరిశీలించేందుకు అభ్యంతరం లేదన్నారు. తెలంగాణ నీటి అవసరాలకు సహకరించేందుకు తమకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదని చేశారు. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. 

తెలంగాణకు అత్యంత కీలకమైన తుమ్మిడిహెట్టి నీటిపారుదల ప్రాజెక్టుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‎తో సోమవారం (అక్టోబర్ 26) సమావేశమయ్యారు. ముంబైలోని సహ్యాద్రి ప్రభుత్వ అతిథి గృహంలో జరిగిన ఈ భేటీలో తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ, మహారాష్ట్రల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దుల్లో ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంపై ఈ సమావేశంలో కీలకమైన  చర్చలు జరిగాయి. బ్యారేజీ ఎత్తు 152 మీటర్లకు పెంపు, నీటి లభ్యత, ముంపు ప్రభావం, ఇతర సాంకేతిక అంశాలపై సమగ్రంగా  చర్చించారు.

ఈ సందర్భంగా మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ మాట్లాడుతూ.. తెలంగాణతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని గుర్తుచేశారు. సరిహద్దులోని ఆదిలాబాద్ ప్రాంతంతో ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. తన అమ్మమ్మ తెలుగు మాట్లాడతారని ఈ సందర్భంగా ప్రస్తావించారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తును పెంచాలన్న తెలంగాణ అభ్యర్థనను మరోసారి పరిశీలించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అయితే, తుది నిర్ణయానికి వచ్చే ముందు పలు అంశాలపై అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సాంకేతిక, పర్యావరణ, పరిపాలనాపరమైన అంశాలను పరిశీలించాలని స్పష్టం చేశారు.

స్నేహభావం, సోదరభావంతో మంచి పొరుగు రాష్ట్రాలుగా ముందుకు వెళ్లాలని అభిప్రాయపడ్డారు. గతంలో ఇతర రాష్ట్రాలతో మహారాష్ట్ర పలు అంతర్రాష్ట్ర సమస్యలను పరిష్కరించుకుందని గుర్తుచేశారు. పరస్పర చర్చలు, సహకారంతో ఆయా సమస్యలకు పరిష్కారం కనుగొన్నామని వివరించారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు విషయంలో కేంద్ర జల సంఘం తన పరిధిలో అవసరమైన అధ్యయనాలు చేపడుతుందని తెలిపారు. సాంకేతిక పరిశీలనలు కొనసాగిస్తుందన్నారు.

ALSO READ : తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి సహకరించండి: మహారాష్ట్ర ముఖ్యమంత్రికి సీఎం రేవంత్ రిక్వెస్ట్

ఈలోపు రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శుల నేతృత్వంలో అధికారుల కమిటీ ఏర్పాటు చేయాలని ఫడ్నవీస్ ప్రతిపాదించారు. బ్యారేజీ ఎత్తు, నీటి లభ్యతపై కమిటీ సమగ్రంగా అధ్యయనం చేయాలని సూచించారు. మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే భూములు, ప్రభావిత ప్రాంతాలను పరిశీలించాలన్నారు. పరిహారం, ఇతర సాంకేతిక అంశాలను కూడా అధ్యయనం చేయాలని చెప్పారు.

ముంపు ప్రభావం, ప్రభావిత భూముల విస్తీర్ణంపై రెండు రాష్ట్రాల అంచనాలను పరిశీలించాలని సూచించారు. ఇరు రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని అవసరమైతే ప్రత్యామ్నాయాలను కూడా అధ్యయనం చేయాలన్నారు. రెండు రాష్ట్రాల అధికారులు, సాంకేతిక నిపుణులు సంప్రదింపులు జరపాలని సూచించారు. తదుపరి సమావేశాల నిర్వహణ, కాలపరిమితులను నిర్ణయించాలన్నారు. ప్రాజెక్టుపై ముందుకు వెళ్లేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలన్నారు. 

దేశంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఇరువురు ముఖ్యమంత్రులు పునరుద్ఘాటించారు. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. గిరిజనులు, ఆదివాసీలు, అభివృద్ధి అవకాశాలు అందని వర్గాల సామాజిక, ఆర్థిక అభ్యున్నతికి కృషి చేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు.