తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి సహకరించండి: మహారాష్ట్ర ముఖ్యమంత్రికి సీఎం రేవంత్ రిక్వెస్ట్

తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి సహకరించండి: మహారాష్ట్ర ముఖ్యమంత్రికి సీఎం రేవంత్ రిక్వెస్ట్

ముంబై: పరస్పర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ నిర్మాణానికి సహకరించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‎కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ కేవలం సాగునీటి ప్రాజెక్టు మాత్రమే కాదన్నారు. రెండు రాష్ట్రాలను భౌతికంగా అనుసంధానించే వారధిగా కూడా నిలుస్తుందన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, గిరిజనుల సంక్షేమానికి రెండు రాష్ట్రాల సహకారం అవసరమన్నారు. 

తెలంగాణకు అత్యంత కీలకమైన తుమ్మిడిహెట్టి నీటిపారుదల ప్రాజెక్టుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‎తో సోమవారం (అక్టోబర్ 26) సమావేశమయ్యారు. ముంబైలోని సహ్యాద్రి ప్రభుత్వ అతిథి గృహంలో జరిగిన ఈ భేటీలో తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ, మహారాష్ట్రల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దుల్లో ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంపై ఈ సమావేశంలో కీలకమైన  చర్చలు జరిగాయి. బ్యారేజీ ఎత్తు 152 మీటర్లకు పెంపు, నీటి లభ్యత, ముంపు ప్రభావం, ఇతర సాంకేతిక అంశాలపై సమగ్రంగా  చర్చించారు.

ఈ సమావేశం ప్రారంభంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్ ద్వారా తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ప్రాధాన్యతను వివరించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చరిత్ర, సంస్కృతి, గిరిజనుల జీవన పరిస్థితులు, ఆర్థిక వెనుకబాటుతనాన్ని మహారాష్ట్ర ప్రతినిధి బృందం దృష్టికి తీసుకెళ్లారు. సుసంపన్నమైన చరిత్ర, సాంస్కృతిక వారసత్వం ఉన్నప్పటికీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిలో వెనుకబడిపోయిందని తెలిపారు. గిరిజనులు, ఆదివాసీలకు అభివృద్ధి ఫలాలు అందలేదన్నారు. ఆర్థిక అవకాశాలు లేకపోవడం, వెనుకబాటుతనం కారణంగా గతంలో నక్సలిజం వంటి సమస్యలు తలెత్తిన పరిస్థితులను వివరించారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణ - మహారాష్ట్ర మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను గుర్తుచేశారు. పూర్వ హైదరాబాద్ సంస్థానంతో రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలకు ఉన్న చారిత్రక అనుబంధాన్ని ప్రస్తావించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రధానంగా వెనుకబడిన అటవీ ప్రాంతమని తెలిపారు.

ALSO READ : SIR సాఫ్ట్ వేర్ వివరాలను.. ఇచ్చేందుకు నిరాకరించిన ఈసీ!..

అక్కడి గిరిజనులు, ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలను మహారాష్ట్ర సీఎం దృష్టికి తీసుకెళ్లారు. కొమురం భీమ్ సాగించిన జల్, జంగిల్, జమీన్ పోరాటాన్ని గుర్తుచేశారు. ఆ పోరాట కాలం నుంచి ఆదిలాబాద్ ప్రాంత ప్రజలు సాగు, తాగునీటి సదుపాయాల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. దశాబ్దాలుగా వారి ఆకాంక్షలు నెరవేరలేదని, ఆదిలాబాద్ గిరిజనులు, ఆదివాసీల జీవితాల్లో వెలుగులు నింపాల్సిన అవసరం ఉందన్నారు. వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు రెండు రాష్ట్రాలు కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని కోరారు.

దేశ రక్షణ, జాతీయ వ్యూహాత్మక ప్రయోజనాల పరంగా ఆదిలాబాద్ ప్రాంతానికి ఉన్న ప్రాధాన్యతను రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆదిలాబాద్‌లో ప్రతిపాదిత రక్షణ, పౌర విమానాశ్రయ సదుపాయం అందుబాటులోకి వస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి ఊతమిస్తుందని తెలిపారు. మహారాష్ట్రలోని సరిహద్దు ప్రాంతాలకూ ప్రయోజనం కలుగుతుందని వివరించారు. 

విమానాశ్రయంతో రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో రవాణా సదుపాయాలతో పాటు ఆర్థిక కార్యకలాపాలు, అభివృద్ధి అవకాశాలు మెరుగుపడుతాయన్నారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ కేవలం సాగునీటి ప్రాజెక్టు మాత్రమే కాదన్నారు. రెండు రాష్ట్రాలను భౌతికంగా అనుసంధానించే వారధిగా కూడా నిలుస్తుందన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, గిరిజనుల సంక్షేమానికి రెండు రాష్ట్రాల సహకారం అవసరమన్నారు. పరస్పర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి సహకరించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రికి సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు.