రాష్ట్రంలో 2 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాం :  మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి  

రాష్ట్రంలో 2 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాం :  మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి  
  • రాష్ట్రానికి కేంద్రం రూ.720 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది 
  • మంత్రి పొంగులేటి వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రెండేండ్లలో రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించినట్లు రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. ఈ ఇండ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రూ.720 కోట్లు రావాల్సి ఉంటుందని చెప్పారు. శుక్రవారం శాసనమండలిలో కాంగ్రెస్ సభ్యుడు మహేశ్‌కుమార్ గౌడ్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. ప్రజా పాలనలో ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.

రాష్ట్రం తరఫున 13 లక్షల ఇండ్లు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని చెప్పారు. ఇప్పటివరకు మొదటి విడత కింద 4.50 లక్షల ఇండ్లు, రెండో విడత కింద మరో 2 లక్షల ఇండ్లు మంజూరు చేశామని తెలిపారు. ఒక్కో నియోజకవర్గానికి మొదటి విడతలో 3,500, రెండో విడతలో 2 వేల చొప్పున ఇండ్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం, నిజామాబాద్ కార్పొరేషన్లలో ఇందిరమ్మ టౌన్‌షిప్‌లు నిర్మిస్తామని స్పష్టం చేశారు.

వీఆర్ఏల పిల్లలకు కారుణ్య నియామకాలు..!

జీవో నంబర్ 81 ప్రకారం 61 ఏండ్ల వయస్సు దాటిన తర్వాత సర్వీసులో కొనసాగి మరణించిన లేదా పదవీ విరమణ పొందిన 3,797 మంది వీఆర్ఏల పిల్లలకు కారుణ్య నియామకాలు కల్పించే అంశం పరిశీలనలో ఉందని మంత్రి పొంగులేటి తెలిపారు. శాసనమండలిలో సభ్యుడు దేశపతి శ్రీనివాస్ అడిగిన మరో ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 16,758 మంది వీఆర్ఏలను వివిధ ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు చేశామని స్పష్టం చేశారు.