- ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రిజిస్ట్రేషన్ శాఖలో రూ.6.50 కోట్లు పెండింగ్
- భూభారతిలో మరో రూ.5 కోట్లు
- ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న బాధితులు
కరీంనగర్, వెలుగు: సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులతోపాటు, గతంలో ధరణిలో ఇప్పుడు భూభారతి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ కోసం బుక్ చేసుకున్న స్లాట్ క్యాన్సిల్ చేసుకుంటే.. అందుకోసం చెల్లించిన ఫీజులు వాపస్ రావట్లేదు. టెక్నికల్ ఇష్యూస్, అనుకోని అవాంతరాల వల్ల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ క్యాన్సిల్ అయితే డబ్బులు తిరిగి ఇవ్వడం లేదు. దీంతో బాధితులు ఏళ్ల తరబడి సబ్ రిజిస్ట్రార్, జిల్లా రిజిస్ట్రార్, తహసీల్దార్, కలెక్టర్ ఆఫీసులకు చుట్టూ తిరుగుతున్నారు. వారేమో తమ చేతుల్లో ఏమి లేదని చేతులెత్తేస్తున్నారు.
సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో 6.50 కోట్లు పెండింగ్
సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్ కోసం చలానా తీసి స్లాట్ బుక్ చేసుకున్నాక టెక్నికల్ సమస్యలు, నిషేధిత జాబితాలో భూమి ఉండడం, కోర్టు వివాదాలు, భూమి అమ్మే వ్యక్తి చివరి నిమిషంలో నిరాకరించడం, ఇతర వివాదాల కారణంగా రిజిస్ట్రేషన్ ఆగిపోతే.. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీల కింద కట్టిన డబ్బులను వెంటనే రీఫండ్ చేయడం లేదు. ఒక్కొక్కరు రూ.30 వేల నుంచి రూ.2 లక్షలకుపైగా చెల్లించారు. ఇలా ఆరేళ్లుగా సుమారు 3 వేల మందికి సంబంధించి రూ.6.50 కోట్లు పెండింగ్ లో ఉండిపోయాయి. దీంతో బాధితులు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్తే.. జిల్లా రిజిస్ట్రార్ దగ్గరికి పంపిస్తున్నారు. అక్కడికి వెళ్తే డీజీ ఆఫీస్కు పంపాం. మీ అకౌంట్ లో జమ అవుతాయని చెప్పి పంపుతున్నారు.
ఆరేళ్లలో ధరణి/భూభారతిలో 2,797 స్లాట్స్ క్యాన్సిల్..
గతంలో ధరణి పోర్టల్ ప్రారంభం నుంచి కూడా స్లాట్ క్యాన్సిల్ అయితే డబ్బులు తిరిగి రావడం లేదు. ఉమ్మడి కరీనగర్ జిల్లాలో 2020 అక్టోబర్ నుంచి 2026 మార్చి వరకు ఉమ్మడి జిల్లాలో ఆరేళ్లలో 2,797 స్లాట్స్ క్యాన్సిల్ అయ్యాయి. క్యాన్సిల్ చేసుకున్న స్లాట్లలో కరీంనగర్ జిల్లాలో 861, జగిత్యాల జిల్లాలో 731, పెద్దపల్లి జిల్లాలో 654, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 551 ఉన్నాయి. వీటికి సంబంధించి సుమారు రూ.5 కోట్లు పెండింగ్ లో ఉండిపోయాయి. గతంలో ధరణి పోర్టల్ నుంచి భూభారతి పోర్టల్ వరకు ఇదే సమస్య నెలకొంది.
ఏళ్లుగా పరిష్కారం కాని టెక్నికల్ సమస్య
సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో స్టాంప్ డ్యూటీ చెల్లించాక రిజిస్ట్రేషన్ ప్రక్రియను ముందే క్యాన్సిల్ చేసుకుంటే.. జిల్లా రిజిస్ట్రార్ స్టాంప్ డ్యూటీలో 10 శాతాన్ని సర్వీస్ చార్జీగా కట్ చేసుకొని మిగతా డబ్బులు వాపస్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా ఆర్నెళ్లలోపు అయితే జిల్లా రిజిస్ట్రార్ పరిధిలో ఉంటుంది. ఆర్నెళ్లలోపు కాకపోతే డీజీ ఆఫీస్ నుంచి జమ కావాల్సి ఉంటుంది.
భూభారతిలో అగ్రికల్చర్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ స్లాట్ క్యాన్సిల్ చేసుకుంటే రీఫండ్ కోసం పేమెంట్ డాక్యుమెంట్లతో కలెక్టర్ కు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కలెక్టర్ వెరిఫై చేశాక డీటీఓ ద్వారా రీఫండ్ ప్రాసెస్ అవుతుంది. చట్టం ప్రకారం 7 రోజుల్లో రీఫండ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉంది. దీంతో నలుగురు బాధితుల తరఫున గుమ్మి రాజ్ కుమార్ రెడ్డి అనే అడ్వకేట్ హైకోర్టులో కేసు వేయగా.. వారికి మాత్రమే ప్రభుత్వం రీఫండ్ చేయడం గమనార్హం.
