తెలంగాణలో కరువు తీవ్రత పెరుగుతోంది. ఇంత ముఖ్యమైన కరువుపై రాష్ట్ర అసెంబ్లీలో ఇప్పటివరకు చర్చ కరువయింది. అత్యధిక ప్రాంతాల్లో రైతులు అల్లాడిపోతున్నారు. ప్రపంచ వాతావరణ మార్పులో భాగంగా వచ్చిన ‘ఎల్‌నినో’ ప్రభావం వ్యవసాయ రంగంమీద ప్రతికూల ప్రభావం చూపుతోంది. లోటు వర్షపాతంతో తలెత్తిన వర్షాభావ పరిస్థితులు రైతును కుంగదీస్తున్నాయి. నీటి లభ్యత ఒత్తిడి పెరిగింది. పంటసాగు విస్తీర్ణం తగ్గింది.
విత్తిన పంట కూడా పలుచోట్ల ఎండిపోయింది. సగటు వర్షపాతం తగ్గి, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పరిస్థితులు విభిన్నంగా ఉన్నాయి. ఉపరితల జల వనరులు తగ్గడం వల్ల రైతులు ప్రధానంగా భూగర్భ జలాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. భూగర్భ జలమట్టాలు అసాధారణ స్థాయిలో తగ్గి అక్కడ కూడా నీటి లభ్యతపై ఒత్తిడి ఎంతో పెరిగింది. విద్యుత్ వినియోగం ఒకవైపు, సాగు పెట్టుబడి మరోవైపు పెరగడం వల్ల బిత్తరపోతున్న రైతును దినదినం బలపడుతున్న కరువు మరింత భయపెడుతోంది. ఈ విపత్తులో ప్రత్యామ్నాయ ప్రణాళికతో ఎంతో కొంత రైతును ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేష్టలుడిగినట్టుందన్నది సర్వత్రా వినిపిస్తున్న విమర్శ.
అసెంబ్లీ ప్రస్తుత సమావేశాల చివరి రోజైన శనివారమైనా కరువుపైన కూలంకషంగా చర్చిస్తారేమోనని తెలంగాణ రైతాంగం ఆశగా ఎదురుచూస్తోంది. సమావేశాలు మొదలై అప్పుడే అయిదు రోజులు అయిపోయింది. వ్యవసాయం, ఆహారోత్పత్తికి సంబంధించి కీలకాంశం కరువు, దాని ప్రభావం, వ్యవసాయం స్థితిగతులు, ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కోవడం, ‘ఫుడ్‌చైన్’, ‘సరఫరా చైన్’ వంటి విషయాలపై సమగ్ర చర్చ అవసరముంది. కరువు ప్రభావం నుంచి రైతాంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం తక్షణ, దీర్ఘకాలిక చర్యలు తీసుకుంటేనే వ్యవసాయ రంగం తట్టుకొని నిలువగలుగుతుంది. లేకుంటే, ఇప్పటికే క్లిష్టంగా ఉన్న గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత ఛిద్రమౌతుంది.
అంచనాలో వైఫల్యం
వాతావరణ మార్పుల మూలంగా సముద్రం, ముఖ్యంగా పసిఫిక్ ఉపరితల గాలులు అసాధారణంగా వేడెక్కడంవల్ల తలెత్తిన ‘ఎల్‌నినో’ను, దాని ప్రతికూల ప్రభావాన్ని సరిగా అంచనా వేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఐక్యరాజ్యసమితి (యూఎన్) ఏర్పాటుచేసిన అంతర ప్రభుత్వాల అధ్యయన బృందం - ఐపీసీసీ ఎప్పటికప్ప్పుడు హెచ్చరిస్తున్నా రాష్ట్ర-, కేంద్ర ప్రభుత్వాలు తగురీతిలో స్పందించలేదు. వర్షాభావ పరిస్థితులు, అతివృష్టి, -అనావృష్టి, కరువులు, -వరదలు వంటి పరస్పర విరుద్ధ వాతావరణ పరిస్థితులతో భారత ద్వీపకల్పంలో వ్యవసాయం, ఆహారోత్పత్తి బాగా దెబ్బతింటాయని ఐపీసీసీ వరుస నివేదికలు చెబుతూనే ఉన్నాయి.
ఆ పరిస్థితుల్ని రానీయకుండా తగినంత ముందుగానే చేపట్టాల్సిన నివారణ చర్యలు (రెజిలియన్స్), దీటుగా ఎదుర్కోగలిగే (మిటిగేషన్), తప్పని పరిస్థితుల్లో ఎదుర్కొన్నా నష్ట నివారణతో జరపాల్సిన సర్దుబాటు (అడాప్టేషన్) చర్యల రూపంలో రెండు ప్రభుత్వాలు చేపట్టిన కార్యాచరణ ప్రణాళిక అంటూ ఏదీ లేదు. సమయం దాటిపోయిన తర్వాత ‘ఎల్‌నినో’ పైన రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అప్పటికే సమయం మించిపోయింది. నిజానికి ఫిబ్రవరి, మార్చి నెలల నుంచే తగు ముందస్తు ప్రణాళికతో చర్యల ప్రక్రియ చేపట్టి ఉండాల్సింది.
తర్వాత ఏర్పాటు చేసిన కమిటీ కూడా ఆదరాబాదరాగా, స్వల్పకాలంలోనే ‘తూతూ మంత్రపు’ కసరత్తు చేసి, కొరగాని నివేదిక ఇచ్చింది. అందులో నిర్దిష్ట కార్యాచరణకు అవసరమైన స్పష్టత కొరవడింది. మరోవైపు వర్షాకాలం దాదాపు ఎత్తిపోయింది. రాష్ట్రమంతటా ఒకేరీతి వాతావరణ పరిస్థితులు లేవు. కొన్నిచోట్ల ఉన్నంతలో కాస్త మెరుగైన వర్షపాతం, తేమ పరిస్థితి ఉన్నా... మెజార్టీ ప్రాంతాల్లో కరువు తీవ్రంగా ఉంది. వేసవికాలం పొడిగింపు వాతా వరణమే కనబడుతోంది. రైతు అల్లాడుతున్నాడు.
‘ఇంకేముంది? కాలంపోయింది’
వర్షపాతం లోటు తక్కువగానే ఉన్నట్టు కనిపిస్తున్నా సాగురీత్యా ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది. జులై 23 వరకు 25 శాతం వర్షపాతం లోటు నమోదయింది. ఆగస్టు మాసాంతానికి అది 38 శాతం లోటుకు చేరింది. ఉత్తర, తూర్పు తెలంగాణలో కొంతవరకు పరిస్థితులు మెరుగ్గానే ఉన్నాయి. హైదరాబాద్ పరిసరాలు, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి తదితర దక్షిణ తెలంగాణలో వర్షపాత లోటు ఎక్కువగా ఉంది. ఎలినినో ప్రభావం వల్ల ఏర్పడ్డ నీటికొరతతో ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు పూర్తిస్థాయిలో నిండకపోవడమే కాకుండా ఉన్న నీరు ఎండ తీవ్రత వల్ల వేగంగా ఆవిరయిపోతోంది.
మెట్ట పంటలకు కీలకమైన నేల తేమ దారుణంగా పడిపోయి సమస్య జటిలమౌతోంది. ఉపరితల జనవనరుల సమస్యవల్ల ఎక్కువగా భూగర్భ జలాలపైనే రైతు ఆధారపడాల్సి వస్తోంది. ఫలితంగా విద్యుత్ వినియోగం పెరిగింది. అదే దామాషాలో విద్యుత్ ఉత్పత్తి స్థిరంగా పెరగటం వల్ల ప్రాజెక్టుల్లోనూ ఉన్న అరకొర నీటిమట్టాలు వేగంగా తగ్గిపోతున్నాయి. రానురాను సాగునీటికే కాకుండా తాగునీటికి కూడా ఎద్దడి తలెత్తవచ్చన్న ఆందోళన సామాన్యుల్లో వ్యక్తమౌతోంది. ఇదే భయంతో, అది అపశబ్దం అని తెలిసినా పలుచోట్ల ‘ఇంకేముంది? కాలంపోయింది’ అనే మాట రైతులు, రైతుకూలీలు అంటున్నారు.
పరిస్థితి వారికి అంత కష్టంగా ఉందనే అంశం, ఒక అధ్యయనంలో భాగంగా క్షేత్రంలో ఉన్న ‘పీపుల్స్ పల్స్’ సర్వేయర్ల దృష్టికి వచ్చింది. రాష్ట్రమంతటా వర్షపాతం -లోటు పరిస్థితి ఏకరీతిలో లేదు కనుక ‘రాష్ట్ర సగటు వర్షపాతం’ ఆధారంగా మొత్తం రాష్ట్ర క్షేత్ర పరిస్థితిని అంచనా వేయొద్దని రైతాంగం కోరుకుంటున్నారు. అందుకే, ప్రజాప్రతినిధులు పాల్గొనే అసెంబ్లీలో ‘కరువు’పై చర్చ జరగాలనేది రైతుల కోరిక.
కరువు మండలాలు ప్రకటించాలి
నీటి లభ్యత లేనిచోట రైతులు పప్పుధాన్యాలు, నూనెగింజలు వంటి ప్రత్యామ్నాయ పంటలకు వెళదామన్నా వారికి తగిన ప్రోత్సాహం ఉండటం లేదు. వరిసాగు తగ్గించి ప్రత్యామ్నాయ పంటల సాగువైపు మళ్లాలని వ్యవసాయశాఖ చెబుతున్నా రైతుకు భరోసా కలగటం లేదు. దిగుబడి ఓ సమస్య. దానికన్నా మద్దతు ధర, కొనుగోలు గ్యారెంటీ వ్యవస్థలు- వాటి అమలు సరిగా లేకపోవడంతో వారు ‘మార్పు’కు ధైర్యం చేయట్లేదు. ఒకవైపు వాతావరణం, వర్షపాతంపరంగా మరోవైపు పంటలపరంగా నెలకొన్న వైవిధ్యం దృష్ట్యా ఏకరీతి ‘రాష్ట్ర ప్రణాళిక’ కాకుండా ప్రభుత్వం ఎక్కడికక్కడ ప్రాంతాలవారీగా కరువు ప్రణాళికతో ముందుకు రావాలని తెలంగాణ రైతాంగం కోరుకుంటున్నారు.
తక్షణం కరువు మండలాలను ప్రకటించాలన్నది డిమాండ్. సర్కారు వైపునుంచి హెచ్చరికల దశ నాటి వెనువెంటనే చర్యలు తీసుకోవాల్సిన దశ ఆసన్నమయింది. వచ్చే రబీ సీజన్ మీద కూడా ప్రస్తుత కరువు, స్థూలంగా ఎల్‌నినో ప్రభావం పడే సూచనలున్నాయి. అందుకే, 2027 రబీ, - ఖరీఫ్‌లో నీటి లభ్యత, వ్యవసాయక విధానాలు, పశుగ్రాసం, ఎరువులు, - రుణ సదుపాయాలు, మద్దతుధర, పంట కొనుగోళ్లు, గ్రామీణ ఉపాధి వంటి అంశాలతో పకడ్బందీ ప్రణాళికను ఇప్పట్నుంచే ప్రభుత్వం సన్నద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నది వ్యవసాయ నిపుణుల సూచన.
దీర్ఘకాలిక చర్యల మీద రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి
వర్షపాతం లోటు, నీటికొరత, వనరులపై ఒత్తిడి, పంట దిగుబడి భయాలు, ఆదాయం తగ్గడం, కూలీలకు పనిదొరకని స్థితి, గ్రామీణ ప్రాంత వినియోగ తరుగుదల, పశుగ్రాస సమస్య, అప్పుల బాధ, వలసలు, ధరల పెరుగుదల, సామాజిక అశాంతి, కరువు దరిమిలా ఉత్పన్నమయ్యే గొలుసుకట్టు పరిణమాల శృంఖలమిది. దీన్ని అధిగమించే తక్షణ, దీర్ఘకాలిక చర్యల మీద రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వెంటనే దృష్టి నిలపాల్సిన అవసరముంది. అప్పుడే రైతుకు, వ్యవసాయానికి రక్ష. రాష్ట్రంలో స్థూలంగా పంట విస్తీర్ణం తగ్గింది. వర్షాభావం, కొనసాగుతున్న ఎండవేడిమి, కరువు పరిస్థితుల వల్ల వేసిన పంటలు కూడా మాడిపోతున్నాయి.
ఖరీఫ్ అన్ని పంటలు కలిపి 1.32 కోట్ల ఎకరాల్లో సాగు జరగాల్సింది. సుమారు 10 శాతం తగ్గినట్లు నివేదికలున్నాయి. వరిసాగు 33 శాతం తగ్గింది. ఉన్న పంటలు కాపాడుకోకుంటే ఆహార కొరత ఏర్పడే ప్రమాదముంది. కరువు తీవ్రత దృష్ట్యా ‘భారత్ రిజర్వుబ్యాంక్’ (ఆర్బీఐ) విపత్తు మార్గదర్శకాలను అనుసరించి ప్రభుత్వం వెంటనే ఉపశమన చర్యలు చేపట్టాలి. తక్షణ పంటరక్షణ, జలవనరులు సమగ్ర నిర్హహణ, ఉపాధి కల్పన, పంటమార్పిడి చేసిన చోట మద్దతు ధర, ఉత్పత్తి కొనుగోలు గ్యారంటీ, రుణాల రీషెడ్యూల్, మారిటోరియం, పాతవాటితో నిమిత్తం లేకుండా కొత్తరుణాల కల్పన, పంటపోయిన చోట బీమా వర్తింపు, నష్టపరిహారం చెల్లింపు వంటివి పటిష్టంగా అమలుపరచాలి. కరువు నివారణ, సమగ్ర వ్యవసాయ నమూనా రచన అమలు ద్వారా రైతుల్ని, తద్వారా వ్యవసాయాన్ని కాపాడుకోవాలి.
- దిలీప్ రెడ్డి, పొలిటికల్ ఎనలిస్ట్,
పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్
ఓపెన్ పేజీ openpage@v6velugu.com
