వెలుగు స్పెషల్ : బ్రిక్స్‌‌‌‌‌‌‌‌ చేతిలో గ్లోబల్‌‌‌‌‌‌‌‌ సౌత్‌‌‌‌‌‌‌‌ భవిష్యత్తు!

వెలుగు స్పెషల్ : బ్రిక్స్‌‌‌‌‌‌‌‌ చేతిలో గ్లోబల్‌‌‌‌‌‌‌‌ సౌత్‌‌‌‌‌‌‌‌ భవిష్యత్తు!

ప్రపంచ ఆర్థిక రాజకీయ వ్యవస్థ వేగంగా మారుతున్న తరుణంలో ఢిల్లీ ప్రధాన కేంద్రంగా సెప్టెంబర్ 12, 13వ తేదీల్లో జరగనున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.  భారత్ నాలుగోసారి బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో జరుగుతున్న ఈ సదస్సు కేవలం దేశాల సమావేశం మాత్రమే కాదు. ప్రపంచ దక్షిణ దేశాల ప్రయోజనాలను అంతర్జాతీయ నిర్ణయ ప్రక్రియలో మరింత బలంగా వినిపించేందుకు అవసరమైన కార్యాచరణను తయారుచేసుకున్న ప్రత్యేక సందర్భంగా చెప్పవచ్చు. 2026 బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు ‘స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం’ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు.

అమెరికా సుంకాల పేరుతో, ఆర్థిక వ్యవస్థ పరిరక్షణ పేరుతో నిరంతరం అనేక ఆంక్షలను విధిస్తున్న పరిస్థితి కనబడుతోంది. అంతేకాకుండా సామ్రాజ్యవాద కాంక్షతో ఇతర దేశాలపైన దాడులను కూడా కొనసాగిస్తుండటం సాధారణమైపోయింది. అంతర్జాతీయ రిజర్వ్ కరెన్సీగా డాలరు ఉండటంతో ప్రపంచ దేశాలు అన్నిటినీ విచక్షణారహితంగా శాసించే  ప్రయత్నం ఈ మధ్యకాలంలో కనబడుతోంది.  అనేక దేశాలు తమ సొంత కరెన్సీలలో విదేశీ వాణిజ్య మారకం చేసుకునేవిధంగా ఒప్పందాలు 
చేసుకుంటున్న పరిస్థితి నెలకొని ఉన్నది. ఇంధన సమస్య, పర్యావరణ సమస్య ప్రపంచాలను గడగడలాడిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో బ్రిక్స్ కూటమి ప్రపంచ ఆర్థిక అభివృద్ధికి దిక్సూచిలా వెలుగొందాల్సిన  అవసరం  కనబడుతుంది.
 బలోపేతం అవుతున్న బ్రిక్స్ స్వరూపం
2021లో 4 అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల కేంద్రంగా వచ్చిన బ్రిక్స్​ భావన, 2026లో రాజకీయ సహకార వేదికగా రూపుదాల్చింది. 2010లో దక్షిణాఫ్రికా చేరటంతో బ్రిక్స్ గా మారింది.  ఆ తర్వాత విస్తరణ మరింత వేగవంతమైంది. ఇథియోపియా, ఇరాన్, ఈజిప్ట్,   సౌదీ అరేబియా, యూఏఈల చేరికతో కూటమి భౌగోళిక పరిధి విస్తృతంగా పెరిగింది. ఈ మధ్యకాలంలోనే ఇండోనేషియా సైతం చేరటంతో ప్రస్తుత సభ్య దేశాల సంఖ్య 11కు చేరింది. 11 సభ్య దేశాలను కలిపితే ప్రపంచ జనాభాలో దాదాపు 50 శాతం,  ప్రపంచ జీడీపీలో పర్చేజింగ్‌‌‌‌ పవర్ పారిటీ ప్రాతిపదికన సుమారు 40%,  ప్రపంచ వాణిజ్యంలో దాదాపు 26% వాటాను ఈ దేశాలు కలిగి ఉన్నాయి. నాలుగు ఖండాల్లో విస్తరించిన ఈ దేశాల వేదికను కేవలం ఒక అభివృద్ధి చెందుతున్న దేశంగా మాత్రమే చూడలేం. ఈ  వేదిక  నేడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను 
ప్రభావితం చేయగలిగే శక్తిగా రూపాంతరం చెందింది.
సభ్య దేశాల సంఖ్య పెరుగుతున్నప్పటికీ అనేక సవాళ్లు కూడా ఉన్నాయి. భారత్, చైనా మధ్య వ్యూహాత్మక  పోటీ, రష్యా  పాశ్చాత్య దేశాల మధ్య తీవ్రమైన భౌగోళిక, రాజకీయ విభేదాలు, ఇరాన్, గల్ఫ్ దేశాల ప్రయోజనాలు కూడా పూర్తిగా ఒకేలా లేవు. అందువల్ల బ్రిక్స్ కూటమిని ఒక రాజకీయ సిద్ధాంతం నడిచే కూటమిగా కాకుండా విభిన్న ప్రయోజనాలు ఉన్న దేశాలు  ఏకాభిప్రాయంతో కలిసి పనిచేస్తున్న బహుళపక్ష  వేదికగా చూడాల్సిన అవసరం ఉంది.
ఇంధన శక్తి.. భారత్‌‌‌‌‌‌‌‌కు కీలకం
బ్రిక్స్‌‌‌‌‌‌‌‌లో ప్రపంచంలోని ముఖ్యమైన ఇంధన ఉత్పత్తి
దారులు,  వినియోగదారులు రెండూ ఉన్నాయి. రష్యా, గల్ఫ్‌‌‌‌‌‌‌‌  దేశాలు  ప్రపంచ ఇంధన సరఫరాలో  కీలక పాత్ర పోషిస్తుండగా,  భారత్‌‌‌‌‌‌‌‌, చైనా వంటి దేశాలు భారీ 
వినియోగదారులు.  అందువల్ల  ఇంధన భద్రత బ్రిక్స్‌‌‌‌‌‌‌‌లో  కీలక అంశంగా మారనుంది.  అదే సమయంలో వాతావరణ మార్పుల నేపథ్యంలో పునరుత్పాదక ఇంధనం, గ్రీన్‌‌‌‌‌‌‌‌ ఎనర్జీ, స్మార్ట్‌‌‌‌‌‌‌‌ గ్రిడ్లు, నిల్వ సాంకేతికత, హైడ్రోజన్‌‌‌‌‌‌‌‌, అణుశక్తి వంటి రంగాల్లో సహకారం పెరగాలి.  భారత్‌‌‌‌‌‌‌‌కు ఇది ప్రత్యేకంగా ముఖ్యం. చమురు, గ్యాస్‌‌‌‌‌‌‌‌పై ఆధారపడే ప్రస్తుత ఆర్థిక వ్యవస్థను కొనసాగిస్తూనే, పునరుత్పాదక ఇంధనాలవైపు వేగంగా మారాల్సిన  ద్వంద్వ అవసరం ఉంది. బ్రిక్స్‌‌‌‌‌‌‌‌ సహకారం 
ఈ మార్పును తక్కువ ఖర్చుతో,  మెరుగైన సాంకేతికతతో సాధించేందుకు ఉపయోగపడవచ్చు.    
ఏఐ నుంచి వ్యవసాయం వరకు
భారత్‌‌‌‌‌‌‌‌ అధ్యక్షతలో బ్రిక్స్‌‌‌‌‌‌‌‌ అజెండా సంప్రదాయ దౌత్య అంశాలకు మాత్రమే పరిమితం కాలేదు. కృత్రిమ మేధ ఆధారిత వ్యవసాయం, డిజిటల్‌‌‌‌‌‌‌‌ సాంకేతికత, ఆరోగ్యం, విద్య, పర్యావరణం, విపత్తు నిర్వహణ వంటి రంగాలకు విస్తరించింది. ఇది భవిష్యత్‌‌‌‌‌‌‌‌ బ్రిక్స్‌‌‌‌‌‌‌‌ స్వరూపాన్ని సూచిస్తోంది. ఏఐ వ్యవసాయంలో పంటల అంచనా,  విత్తనాల ఎంపిక,  నీటి వినియోగం, 
వాతావరణ ప్రమాదాల అంచనా వంటి రంగాల్లో దాని వినియోగం పెరుగుతోంది. అదేవిధంగా భారత్‌‌‌‌‌‌‌‌ చేపడుతున్న డిజిటల్‌‌‌‌‌‌‌‌ పబ్లిక్‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌ అనుభవాన్ని ఇతర గ్లోబల్‌‌‌‌‌‌‌‌ సౌత్‌‌‌‌‌‌‌‌ దేశాలతో పంచుకునే అవకాశం ఉంది. బ్రిక్స్‌‌‌‌‌‌‌‌ కమ్యూనికేషన్స్‌‌‌‌‌‌‌‌ మంత్రుల సమావేశంలో స్థిరమైన డిజిటల్‌‌‌‌‌‌‌‌ మౌలిక వసతులు, సైబర్‌‌‌‌‌‌‌‌ భద్రత, డిజిటల్‌‌‌‌‌‌‌‌ నైపుణ్యాలు, స్టార్టప్‌‌‌‌‌‌‌‌లు, ఆవిష్కరణలను నాలుగు ప్రధాన స్తంభాలుగా భారత్‌‌‌‌‌‌‌‌ ముందుకు తెచ్చింది.
ఆరోగ్యం, విద్య, మానవ అభివృద్ధి
బ్రిక్స్‌‌‌‌‌‌‌‌ సహకారం కేవలం ప్రభుత్వాల మధ్య సంబంధాలకు పరిమితం కాకుండా ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం కలిగించే దిశగా వెళ్లాల్సిన అవసరం ఉంది. మానసిక ఆరోగ్యం, సంప్రదాయ వైద్యం, ఆరోగ్య సాంకేతికత, విద్య, నైపుణ్యాభివృద్ధి వంటి రంగాల్లో భాగస్వామ్యం అందుకు ఉపయోగపడుతుంది. భారత్‌‌‌‌‌‌‌‌ అధ్యక్షతలో జరిగిన బ్రిక్స్‌‌‌‌‌‌‌‌ విద్యామంత్రుల సమావేశంలో  విద్యాసంస్థల మధ్య సహకారం, అధ్యాపకులు–విద్యార్థుల మార్పిడి, ఎస్‌‌‌‌టీఈఎం విద్య,  నైపుణ్యాభివృద్ధి వంటి  అంశాలపై దృష్టి పెట్టారు.
చరిత్రలో కీలకం కానున్న ఢిల్లీ సదస్సు 
ప్రపంచశక్తి సమీకరణం పశ్చిమ దేశాలకే పరిమితం కాకుండా బహుళ ధ్రువ ప్రపంచంగా మారుతున్న సమయంలో, గ్లోబల్‌‌‌‌‌‌‌‌ సౌత్‌‌‌‌‌‌‌‌ ప్రయోజనాలను సమన్వయం చేసి నిర్మాణాత్మక అంతర్జాతీయ శక్తిగా బ్రిక్స్‌‌‌‌‌‌‌‌ను తీర్చిదిద్దగలిగితే ఢిల్లీ సదస్సు చరిత్రలో కీలక మలుపుగా నిలుస్తుంది. ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతూనే  పశ్చిమ దేశాలతో కూడా సఖ్యతను ఏర్పరచుకునే విధంగా దౌత్యనీతిని పెంపొందించాల్సిన బాధ్యత బ్రిక్స్ కూటమి పైన ఉంది.  ప్రపంచ దేశాలలో వేగంగా మారుతున్న సమీకరణాల నేపథ్యంలో,  సరికొత్త  ఆర్థిక బంధాలను పెంపొందించడానికి,  ప్రపంచ మానవాళి మనుగడ సజావుగా సాగేవిధంగా కృషి చేయాల్సిన అవసరం కనబడుతోంది. ప్రపంచ పాలనా వ్యవస్థను మరింత సమతుల్యంగా బ్రిక్స్‌‌‌‌‌‌‌‌ మార్చే వేదికగా దాన్ని తీర్చిదిద్దడమే భారత నాయకత్వానికి అసలు పరీక్ష. అదే సమయంలో ప్రస్తుత ప్రపంచ పాలనా వ్యవస్థలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు తగిన ప్రాతినిధ్యం లేదన్న వాదనను బలంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల్లో సంస్కరణలు, అభివృద్ధి చెందుతున్న దేశాలకు మరింత ప్రాతినిధ్యం, అభివృద్ధి నిధులు, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ వంటి 
అంశాలు దీనిలో ముఖ్యమైనవి.

డాలర్‌‌‌‌‌‌‌‌ ఆధిపత్యం..
బ్రిక్స్‌‌‌‌‌‌‌‌ ప్రత్యామ్నాయం ఎంతవరకు?
బ్రిక్స్‌‌‌‌‌‌‌‌ చర్చల్లో అత్యంత ముఖ్యమైన అంశం ఆర్థిక  పరస్పర  సహకారం.  ప్రపంచ వాణిజ్యంలో  బ్రిక్స్‌‌‌‌‌‌‌‌  దేశాల వాటా పెరుగుతున్నప్పటికీ,  అంతర్జాతీయ చెల్లింపుల్లో  అమెరికా డాలర్‌‌‌‌‌‌‌‌ ఆధిపత్యం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో  స్థానిక కరెన్సీల్లో  వాణిజ్యం,  చెల్లింపు వ్యవస్థల అనుసంధానం, ఆర్థిక సహకారం వంటి అంశాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. అయితే  బ్రిక్స్‌‌‌‌‌‌‌‌ ఒకే  కరెన్సీని తీసుకురావడం సమీప  భవిష్యత్తులో సాధ్యమయ్యే అంశంగా  కనిపించడం లేదు. సభ్యదేశాల ఆర్థిక వ్యవస్థలు,  ద్రవ్య విధానాలు, రాజకీయ ప్రయోజనాలు భిన్నంగా ఉన్నాయి.  అందువల్ల ఒకే బ్రిక్స్‌‌‌‌‌‌‌‌ కరెన్సీ కంటే  స్థానిక కరెన్సీల వినియోగం, చెల్లింపు వ్యవస్థల బలోపేతం, ఆర్థిక సహకారం పెంపు లాంటి అంశాల పైన దృష్టి  సారించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ భారత్‌‌‌‌‌‌‌‌కు మరో సవాలు ఉంది. చైనాతో  వాణిజ్యం పెద్దదైనా,  వాణిజ్య లోటు కూడా  గణనీయమే.  కాబట్టి  బ్రిక్స్‌‌‌‌‌‌‌‌ వేదికగా వాణిజ్య సహకారం పెంచుతూనే  దేశీయ తయారీ,  సరఫరా  గొలుసుల  భద్రత, సాంకేతిక  స్వావలంబనను భారత్‌‌‌‌‌‌‌‌ కాపాడుకోవాలి.

-చిట్టెడ్డి కృష్ణారెడ్డి, అసోసియేట్ ప్రొఫెసర్,  
 హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ
ఓపెన్​ పేజీ openpage@v6velugu.com