హైదరాబాద్ లో ఫుట్ పాత్ లు లేక.. నడక నరకం.. 14వేల కిలోమీటర్ల రోడ్లు..750 కిలోమీటర్లలోనే ఫుట్ పాత్ లు

హైదరాబాద్ లో ఫుట్ పాత్ లు లేక.. నడక నరకం.. 14వేల కిలోమీటర్ల రోడ్లు..750 కిలోమీటర్లలోనే ఫుట్ పాత్ లు
  • అన్ని చోట్లా ఆక్రమణలే 
  • చెట్లు, బోర్డులు, ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫార్మర్లు, చెత్త కుప్పలకూ నిలయాలు  
  • జీహెచ్ఎంసీలో శనివారం స్పెషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్రైవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బంద్​ 
  • దిక్కులేక రోడ్లపైనే నడుస్తున్న పాదచారులు 
  • ఏటా వందలాది మంది బలి

హైదరాబాద్‌‌ సిటీ, వెలుగు : నగరంలో ఫుట్‌‌పాత్‌‌ లేక, ఉన్నా ఆక్రమణలకు గురవడంతో జనాల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఫుట్​పాత్​ల విషయాన్ని సీరియస్​గా తీసుకోవాలని పలు సందర్భాల్లో సుప్రీం కోర్టుతో పాటు హైకోర్టు ఆదేశాలు ఇస్తున్నా అధికారులు లైట్​తీసుకుంటున్నారు.  దీంతో పాదచారి అయిన పాపానికి ప్రాణాలు పోగొట్టుకోవలసి వస్తున్నది. ఫుట్‌‌పాత్‌‌లను ప్రైవేట్​వ్యక్తులతో పాటు ప్రభుత్వ సంస్థలు కూడా ఆక్రమిస్తున్నాయి. 

కొందరు వ్యాపారాలకు, మరికొందరు అక్రమ పార్కింగ్‌‌ కు, ఇంకొందరు నిర్మాణ సామగ్రి అమ్ముకోవడానికి, ప్రకటన బోర్డులు పెట్టుకోవడానికి, చెత్త వేయడానికి ఉపయోగించుకుంటున్నారు. ఇక ప్రభుత్వ సంస్థలైన టీజీఎస్పీడీసీఎల్​ చాలా చోట్ల ట్రాన్స్‌‌ఫార్మర్ల ఏర్పాటుకు ఫుట్​పాత్​లను ఉపయోగిస్తున్నది. పచ్చదనం పెంచాలనుకున్న కొన్ని శాఖలు కొంతకాలం కింద చెట్లను తెచ్చి ఏకంగా ఫుట్​పాత్​లపైనే నాటడంతో అవి పెరిగి పెద్దయి పాదచారుల నడకకు ఆటంకంగా మారాయి.  

ఫుట్​పాత్​లు పది శాతం కూడా లేవు  

హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లలో 14, 787.66 కిలోమీటర్ల మేర రోడ్లు ఉండగా కేవలం 750 కిలోమీటర్ల మేరనే ఫుట్​పాత్​లు ఉన్నాయి. ఐఆర్​సీ స్టాండర్డ్స్​ ప్రకారం సిటీలో ఉన్న ప్రతి పబ్లిక్ రోడ్డుకు రెండువైపుల్లో కనీసం ఒక వైపైనా ఫుట్‌‌పాత్ ఉండాలి.  ఇక మెయిన్​రోడ్లు, ఫోర్​ లేన్లలో  వందకు వంద శాతం ఫుట్​పాత్​లు నిర్మించాల్సిందే.. కానీ, 750 కిలోమీటర్లలోనే ఫుట్​పాత్​లు ఉన్నాయి. ఇవి కూడా ఆక్రమణలకు గురై పాదచారులు రోడ్లపై నడుస్తూ ప్రాణాలు కోల్పోవాల్సి వస్తున్నది. 

శనివారం స్పెషల్​డ్రైవ్​ఏమాయే? 

కోర్టు ఆదేశాలు ఇచ్చిన ప్రతిసారి ఫుట్​పాత్​ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతామని ప్రకటనలు చేసే అధికారులు కొద్ది రోజులు కాగానే సైలెన్స్​అయిపోతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రతి శనివారం ఫుట్​పాత్​ఆక్రమణలపై ప్రత్యేక డ్రైవ్‌‌ నిర్వహిస్తామని ప్రకటించినా.. కొద్ది నెలలకే బంద్​చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌‌లో ‘సాటర్​డే స్పెషల్​డ్రైవ్​’ మొదలుపెట్టగా, మూడు శనివారాల్లో దాదాపు 2500 ఆక్రమణలను తొలగించామని ప్రకటనలు చేశారు. ‘పాదచారుల సౌకర్యం కోసం ఇలాంటి చర్యలు కొనసాగుతాయ్’ అని చెప్పినా నెల రోజులుగా ఎక్కడ ఆక్రమణల తొలగింపుప కనిపించడం లేదు. 

సీఎంసీలో జస్ట్​ ఓకే .. ఎంఎంసీలో నామమాత్రం 

కొత్తగా ఏర్పడిన కార్పొరేషన్​ సీఎంసీ పరిధిలో ‘వాక్‌‌ ఫ్రీ’ పేరుతో ప్రతి శనివారం ఆక్రమణలపై చర్యలు చేపడుతున్నప్పటికీ, అవి కూడా నామమాత్రంగానే కొనసాగుతున్నాయనే విమర్శలున్నాయి. రెండు నెలల్లో ‘వాక్‌‌ ఫ్రీ’ కార్యక్రమం కింద సుమారు 2 వేల వరకు ఆక్రమణలను తొలగించినట్లు ఇక్కడి అధికారులు చెప్తున్నా..మేజర్​గా ఇబ్బందులున్న ప్రాంతాల్లో చర్యలు తీసుకోవడంలేదన్న విమర్శలున్నాయి. ఇక ఎంఎంసీలో అయితే ఏదో నామమాత్రంగా చర్యలు తీసుకుంటుండటంతో ఫుట్ పాత్ లు ఆక్రమణలకు గురవుతూనే ఉన్నాయి. 

కలవరపరుస్తున్న చావుల సంఖ్య 

పాదచారుల రోడ్డు ప్రమాద మరణాలకు సంబంధించి హైదరాబాద్‌‌ ట్రాఫిక్‌‌ పోలీసుల గణాంకాలు చూస్తే ఆందోళన కలుగుతున్నది. 2021లో రోడ్లపై నడుస్తున్న 96 మంది ప్రాణాలు కోల్పోగా, 2022లో ఈ సంఖ్య 101కి చేరింది. అలాగే,  2023లో కాస్త తగ్గి 98 మందికి చేరింది. 2024లో 118 మంది కన్నుమూయగా, 2025లో 105 మంది చనిపోయారు.  

2026లో ఇప్పటికే సుమారు 80 మంది  పాదచారులు వివిధ రోడ్డు ప్రమాదాల్లో తనువు చాలించారు. గతేడాది హైదరాబాద్‌‌, సైబరాబాద్‌‌, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో సుమారు 580 మంది పాదచారులు బలైపోయారు. వృద్ధులు, చిన్నారులు, మహిళలు ప్రధానంగా ఫుట్‌‌పాత్‌‌ ఆక్రమణల కారణంగా రోడ్లపై నడుస్తూ మరణిస్తున్నారు. 

కోర్టులు ఆదేశించినప్పుడే హడావిడి...

దేశంలోని ప్రధాన నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌‌లో ఫుట్‌‌పాత్‌‌ ఆక్రమణలు తీవ్రంగా ఉన్నాయి. రోడ్డు ప్రమాదాలు, ఫుట్‌‌పాత్‌‌ ఆక్రమణలపై సుప్రీంకోర్టుతో పాటు హైకోర్టు కూడా గతంలో ఎన్నోసార్లు ఆందోళన వ్యక్తం చేసింది. హైకోర్టు పరిసర ప్రాంతాల్లోనే ఫుట్‌‌పాత్‌‌ ఆక్రమణలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ..ట్రాఫిక్‌‌ పోలీసులు, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేసి ఆక్రమణలను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. 

కోర్టు ఆదేశాల తర్వాత  ఫుట్‌‌పాత్‌‌ ఆక్రమణలను తొలగించినప్పటికీ, నిరంతర పర్యవేక్షణ కరువవడంతో మళ్లీ యథాతథ స్థితికి చేరుకుంది. సిటీలో అనేక మెయిన్​రోడ్ల వెంట ఫుట్‌‌పాత్‌‌లు లేకపోగా..ఉన్న చోట్ల కూడా రోడ్లు, ఫుట్‌‌పాత్‌‌లను ఆక్రమణకు గురయ్యాయి. 

భిక్ష కాదు..అది హక్కు 

నడవడం అనేది ఆర్టికల్ ​21 ప్రకారం పౌరుడి జీవించే హక్కు. అది ప్రభుత్వాలు ఇచ్చే భిక్ష కాదు. రోడ్డున్న ప్రతిచోటా ఫుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాత్ ఉండాల్సిందే. ఫుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లపై ఆక్రమణలు ఉండటానికి వీల్లేదు. మున్సిపల్ కార్పొరేషన్లు, స్థానిక సంస్థలు క్రమం తప్పకుండా డ్రైవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు నిర్వహించి ఆక్రమణలను తొలగించాలి. ప్రతి ఫుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాత్ సాధారణ ప్రజలతో పాటు దివ్యాంగులు, వృద్ధులు సులభంగా, సురక్షితంగా ఉపయోగించేలా ఉండాలి. ఫుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను నిర్మించి, కాపాడాల్సిన పూర్తి బాధ్యత మున్సిపల్ కార్పొరేషన్లు, అర్బన్ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ అథారిటీలు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయితీలదే.. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే, ప్రజలు కోర్టులను ఆశ్రయించొచ్చు. – సుప్రీం కోర్టు

టోలిచౌకీ ఫ్లైఓవర్ పక్కన అర కిలోమీటర్ మేర ఫుట్ పాత్ లను ఆక్రమించి సిమెంట్, ఇసుక, కంకర పోసి అమ్ముతున్నారు. ఇష్టమున్నట్టు ఫుట్ పాత్ ను పూర్తిగా ధ్వంసం చేసి లోడ్ల మీద లోడ్లు వేసి ట్రాన్స్​పోర్టేషన్​కోసం వాడే టిప్పర్లను కూడా అక్కడే పార్క్​చేస్తున్నారు. దీంతో పాదచారులు రోడ్డుపైనే నడుచుకుంటూ వెళ్తూ ప్రమాదాల భారిన పడుతున్నరు. ఇదే ఫుట్ పాత్ పై టీ స్టాల్స్ కోసం షెడ్లను కూడా నిర్మిస్తున్నారు. ఏండ్లుగా నడుస్తున్నా యాక్షన్​తీసుకునే అధికారే లేకుండా పోయాడు.  

ఫుట్​పాత్​లు చెరిగిపోయాయ్​ 

ఫుట్‌‌పాత్‌‌లు  ప్రజల మనస్సుల నుంచి, అధికారుల ప్రణాళికల నుంచి పూర్తిగా చెరిగిపోయాయి. పౌరులను రోడ్లపైకి నెట్టి వారి ప్రాణాలను ప్రమాదంలో పడేసే హక్కు ఎవరికీ లేదు. అధికారులు మొదట హైకోర్టు చుట్టుపక్కల ఉన్న ఫుట్‌‌పాత్ ఆక్రమణలను తొలగించడం ద్వారా  డ్రైవ్‌‌ ప్రారంభించాలి. ఆక్రమణలను ఒకసారి తొలగించి వదిలేయడం కాదు, అవి మళ్లీ పుట్టుకొచ్చేందుకు వీల్లేకుండా ఫుట్‌‌పాత్‌‌ల వెంబడి శాశ్వత ఇనుప గ్రిల్స్ లేదా ప్రొటెక్టివ్ గేట్లు ఏర్పాటు చేయాలి. 

రోడ్ల పక్కన, ఫుట్‌‌పాత్‌‌లపై అడ్డగోలుగా వాహనాలు పార్క్ చేసే వారిపై అలా పార్కింగ్ చేయిస్తున్న దుకాణదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి భారీ జరిమానాలు విధించాలి.  న్యాయస్థానాలు  ఆదేశాలిచ్చినా క్షేత్రస్థాయిలో అమలు చేయకుండా నిర్లక్ష్యం వహించే టౌన్ ప్లానింగ్, మున్సిపల్, ఇతర అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి .
–  రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం  

ప్రాణాలే పోయాయ్​! 

వికారాబాద్: వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలంలోని ఎల్లకొండలో సీసీ రోడ్డుపై  నడుచుకుంటూ వెళ్తున్న మహిళను ట్రాక్టర్​ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే కన్నుమూసింది. గ్రామానికి చెందిన కాశీపురం కిష్టమ్మ(50) శుక్రవారం ఉదయం 10.30 గంటలకు జిరాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షాపుకు నడుచుకుంటూ వెళ్తోంది. వడ్ల యాదగిరి ఇంటి సమీపంలో ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ ఆమెను ఢీకొట్టింది. 

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కిష్టమ్మను దవాఖానకు తరలిస్తుండగా చనిపోయింది. ట్రాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను డ్రైవర్ ఇర్లపల్లి ప్రశాంత్ నిర్లక్ష్యంగా,అజాగ్రత్తగా, ఓవర్​స్పీడ్​తో నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని నవాబుపేట్ ఎస్సై గిరితెలిపారు. మృతురాలి బిడ్డ స్వాతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

నడుచుకుంటూ వెళ్తుంటే  దూసుకువచ్చిన కారు..మహిళకు తీవ్ర గాయాలు  

జూబ్లీహిల్స్ : ఫుట్​పాత్​లేక రోడ్డుపై ఆఫీసుకు నడుచుకుంటూ వెళ్తున్న అక్కాచెల్లెళ్లపై దూసుకువచ్చిన కారు ప్రాణాలు తీసేంత పని చేసింది. మద్యం మత్తులో వేగంగా, నిర్లక్ష్యంగా నడిపిన కారు డ్రైవర్​రోడ్డుపై వెళ్తున్న మహిళను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడింది. బంజారాహిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోడ్డు నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 14లో వెంకటేశ్వరస్వామి ఆలయం సమీపంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. నంది నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోడ్డు నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌14కు చెందిన రంజనా రాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(32) సాఫ్ట్​వేర్​ఎంప్లాయ్. 

ఉదయం11:45 గంటలకు తన చెల్లెలు అంజుమ్ రాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి ఆఫీసుకు నడుచుకుంటూ వెళ్తోంది. అదే టైంలో రోడ్డు నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 7 నుంచి కేబీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వైపు ధర్మ తేజ (29),  కిరణ్మయి కారులో వస్తున్నారు. మద్యం మత్తులో ఉన్న ధర్మ తేజ అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా వాహనం నడిపి రంజన రాయ్ ను బలంగా ఢీకొట్టాడు. దీంతో ఆమె ఎడమ కాలికి, ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను దవాఖానకు తరలించారు. కారును నడిపిన ధర్మ తేజను పోలీసులు అదుపులోకి తీసుకుని బ్రీత్ ఎనలైజర్ పరీక్ష చేయగా, పరీక్షలో 260 రీడింగ్ నమోదైంది.