నల్గొండ/సూర్యాపేట, వెలుగు: రైస్‌మిల్లర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే ఈ నెల 11 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కస్టమ్ మిల్లింగ్ (సీఎంఆర్) కార్యక్రమాన్ని నిలిపివేస్తామని నల్గొండ, సూర్యాపేట జిల్లా రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షులు హెచ్చరిస్తూ శనివారం ఆయా కలెక్టరేట్ల ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ప్రస్తుతం క్వింటా ధాన్యానికి 67 కిలోల బియ్యం రాబడి సాధ్యం కాదని, ఖరీఫ్‌లో 60 కిలోలు, రబీలో 50 కిలోలలోపే వస్తోందని, నిబంధనలను పునఃపరిశీలించాలని కోరారు.
మిల్లుల సామర్థ్యానికి మించి ధాన్యం కేటాయించడం వల్ల సమస్యలు వస్తున్నాయని, అధికారుల అనుమానాస్పద ధోరణిని మార్చుకోవాలని పేర్కొంటూ ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
