- ట్రాన్స్‌జెండర్లకు స్థానిక పాలనలో భాగస్వామ్యం చారిత్రక నిర్ణయం: మంత్రి శ్రీధర్‌బాబు
- ఈ నిర్ణయం దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
- మున్సిపాలిటీల్లోనూ ట్రాన్స్‌జెండర్లకు చాన్స్ ఇవ్వాలి: పాల్వాయి హరీశ్ బాబు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ట్రాన్స్‌జెండర్లను స్థానిక పాలనలో భాగస్వాములను చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ కార్పొరేషన్లలో ట్రాన్స్‌జెండర్లను కో–ఆప్షన్ సభ్యులుగా నియమించేందుకు ఉద్దేశించిన ‘తెలంగాణ పురపాలక చట్టం(సవరణ)–2019’ బిల్లును శుక్రవారం మంత్రి శ్రీధర్‌బాబు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు అన్ని పార్టీలు సంపూర్ణ మద్దతు తెలిపి ఏకగ్రీవంగా ఆమోదించాయి. అలాగే, మండలిలోనూ మంత్రి శ్రీధర్ బాబు ఈ బిల్లును ప్రవేశ పెట్టగా సభ్యులందరి మద్దతుతో ఆమోదం పొందింది.
నంతరం మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో క్యూర్ పరిధి బయటున్న 9 మున్సిపల్ కార్పొరేషన్లలో కో ఆప్షన్ సభ్యులుగా ట్రాన్స్ జెండర్లను నియమించనున్నట్లు వెల్లడించారు. ప్రతి కార్పొరేషన్ లో ఒకరిని ఎంపిక చేస్తామని తెలిపారు. రాష్ట్రంలోని మున్సిపల్ పరిపాలనలో అనుభవం ఉన్న ముగ్గురు, మైనార్టీ వర్గానికి చెందిన ఇద్దరితోపాటు.. ఇకపై ఒక ట్రాన్స్‌జెండర్‌ను కో–ఆప్షన్ సభ్యులుగా నియమిస్తామని వివరించారు.
దీనివల్ల బడ్జెట్, పారిశుద్ధ్యం, ప్రజారోగ్యం, సంక్షేమ పథకాల రూపకల్పనలో వారు తమ సమస్యలను నేరుగా ప్రస్తావించే అవకాశం లభిస్తుందన్నారు. సంబంధిత మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఓటరుగా నమోదై ఉండాలని, నోటిఫికేషన్ నాటికి కనీసం 21 ఏళ్ల వయస్సు నిండి ఉండాలన్నారు. కౌన్సిల్ సమావేశాల్లో పాల్గొని మాట్లాడే హక్కు ఉంటుందని, కానీ ఓటు హక్కు ఉండదని పేర్కొన్నారు.
ఈ నిర్ణయం దేశానికి ఆదర్శం
ట్రాన్స్‌జెండర్లను పాలనలో భాగస్వాములను చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని, ఈ నిర్ణయం దేశానికి ఆదర్శమని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. కౌన్సిల్ సమావేశాల ద్వారా వారి హక్కులను కాపాడే అవకాశం లభిస్తుందన్నారు. ట్రాన్స్‌జెండర్లకు కేవలం కార్పొరేషన్లకే పరిమితం కాకుండా మున్సిపాలిటీల్లోనూ అవకాశం ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీశ్ బాబు కోరారు.
‘తెలంగాణ పురపాలక చట్టం–2019’ సవరణ బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నామన్నారు. తమిళనాడు తరహాలో ట్రాన్స్‌జెండర్ల వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో ట్రాన్స్‌జెండర్ల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక క్లినిక్‌లు పనిచేసేలా చూడాలని డిమాండ్ చేశారు. రామగుండంలో ఇప్పటికే పలువురు ట్రాన్స్‌జెండర్లకు ఇళ్ల స్థలాలు ఇచ్చామని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఠాకూర్ తెలిపారు. వారికి కోఆప్షన్ సభ్యులుగా అవకాశం కల్పించడం అభినందనీయమన్నారు.
ట్రాన్స్‌జెండర్లకు గ్రామ పంచాయతీ, మండల పరిషత్‌లలోనూ కో–ఆప్షన్ అవకాశాలు కల్పించాలని, ఫేక్ ట్రాన్స్‌జెండర్ల బెడద లేకుండా డేటా వెరిఫికేషన్ చేయాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ప్రభుత్వాన్ని కోరారు. ఆదివాసీలు, ముస్లింలు, ఇతర వర్గాల్లో ఎంతమంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారో గుర్తించాలన్నారు. ప్రభుత్వ నిర్ణయం విప్లవాత్మకమైనదని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కొనియాడారు. రాష్ట్రంలో ఉన్న ట్రాన్స్‌జెండర్ల పూర్తి సమాచారాన్ని సేకరించాలన్నారు.సమాజంలో చిన్నచూపు చూసే వర్గానికి చట్టసభల్లో గుర్తింపు దక్కడం గొప్ప విషయమంటూ చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫికర్ అలీ పేర్కొన్నారు.
ఇప్పటికే ట్రాఫిక్ విభాగంలో..
సీఎం రేవంత్ రెడ్డి సూచనలతో ఇప్పటికే హైదరాబాద్ నగరంలోని ట్రాన్స్‌జెండర్లను ట్రాఫిక్ విభాగంలో విధుల్లోకి తీసుకున్నామని, దేశంలోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి గుర్తుచేశారు. ట్రాన్స్‌జెండర్లకు స్థానిక పాలనలో భాగస్వామ్యం చారిత్రక నిర్ణయమని పేర్కొన్నారు. వారికి గౌరవప్రదమైన జీవనోపాధి, వైద్య సౌకర్యాలు కల్పించి సమాజంలో మంచి గుర్తింపు తెచ్చేందుకు ప్రజా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.
ట్రాన్స్‌జెండర్ల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, వారికి ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తామని ప్రకటించారు. కాగా, బిల్లుకు సభ్యులందరు మద్దతు ఇచ్చినందుకు మంత్రి శ్రీధర్‌బాబు ధన్యవాదాలు తెలిపారు.
