- పంజాబ్‌లో నిందితుడు అరెస్ట్
- ఏఐసీసీ కార్యదర్శి కుసుమ కుమార్ ఫిర్యాదుతో పోలీసుల విచారణ
హైదరాబాద్ సిటీ, వెలుగు: నకిలీ గుర్తింపుతో రాజకీయ పదవులు ఇప్పిస్తానని మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర నిందితుడు గౌరవ్ కుమార్ అలియాస్ గోరా (45)ను పంజాబ్‌లోని పాటియాలా సెంట్రల్ జైలు నుంచి ప్రొడక్షన్ ట్రాన్సిట్ (పీటీ) వారెంట్‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సిటీకి తీసుకొచ్చారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఓ క్రైమ్ కేసులో నిందితుడి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
జులై 1, 2026న ఏఐసీసీ కార్యదర్శి జెట్టి కుసుమ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడు +918081478396 నంబర్‌ను ఉపయోగించి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాజకీయ సహచరుడైన కనిష్క్ సింగ్‌గా పరిచయం చేసుకుంటూ వాట్సాప్ కాల్స్, మెసేజ్‌ల ద్వారా పలువురిని సంప్రదించాడు. డబ్బు చెల్లిస్తే రాజకీయ పదవులు, మద్దతు, ఇతర ప్రయోజనాలు కల్పిస్తానని నమ్మబలికాడు.
ఇలా దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 14 మంది బాధితులను మోసం చేసి సుమారు రూ.3 కోట్ల నగదు, బంగారు ఆభరణాలను సేకరించాడు. నిందితుడు వివిధ రాజకీయ పార్టీల తరఫున ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన అభ్యర్థులను తాను రాహుల్ గాంధీ రాజకీయ సహచరుడిగా పరిచయం చేసుకుంటూ సంప్రదించినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. అనుమానాస్పద కాల్స్ లేదా ఆర్థిక డిమాండ్లు ఎదురైతే వెంటనే 1930కు ఫోన్ చేయాలని లేదా cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.
