- పంటలను కనీస మద్దతు ధరకు విక్రయించుకునేలా చర్యలు చేపట్టాలి
- సంయుక్త కిసాన్ మోర్చా, తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ డిమాండ్
బషీర్‌బాగ్/హైదరాబాద్ సిటీ, వెలుగు: తెలంగాణలో కౌలు సాగుదారుల గుర్తింపు ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ప్రారంభించాలని సంయుక్త కిసాన్ మోర్చా ,తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ డిమాండ్ చేశాయి. ఈ ఖరీఫ్ సీజన్ నుంచే కౌలు రైతులను గుర్తించి వారికి సాగుదారు కార్డులు జారీ చేయడంతో పాటు, వారు తమ పంటలను కనీస మద్దతు ధరకు విక్రయించుకునేలా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశాయి.
శుక్రవారం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో సంయుక్త విలేకరుల సమావేశం నిర్వహించాయి. సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కమిటీ తరఫున పశ్య పద్మ (తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం), టి. సాగర్ (తెలంగాణ రైతు సంఘం), బి.కొండల్ (రైతు స్వరాజ్య వేదిక), ఏనుగు చంద్రారెడ్డి, భాస్కర్ (ఏఐకెఎంఎస్) జక్కుల వెంకటయ్య (తెలంగాణ రైతాంగ సమితి),తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ తరఫున: విస్సా కిరణ్‌కుమార్, కన్నెగంటి రవి (రైతు స్వరాజ్య వేదిక), పి. శంకర్, రౌతు రమేష్ (దళిత బహుజన్ ఫ్రంట్) పాల్గొన్నారు.
ఎల్నినోతో ఉత్పత్తి తగ్గే అవకాశం
కౌలు రైతుల గుర్తింపు కోసం 2011 భూ అధీకృత సాగుదారుల చట్టాన్ని అమలు చేయాలని, ఈ ఖరీఫ్ నుంచే కౌలు రైతులకు సాగుదారు కార్డులు ఇవ్వాలని తాము గత కొన్ని నెలలుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని నాయకులు తెలిపారు. ప్రభుత్వం ఇప్పటివరకు ఈ ప్రక్రియను ప్రారంభించకుండా ఆలస్యం చేయడం వల్ల తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.
తక్కువ వర్షపాతం, ఎల్‌నినో ప్రభావం కారణంగా ఈ ఏడాది పంట ఉత్పత్తి తగ్గే అవకాశం ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కౌలు సాగుదారులు తమ పంటలను కనీస మద్దతు ధరకు విక్రయించుకోలేకపోతే వారి ఇబ్బందులు తీవ్ర స్థాయికి చేరతాయన్నారు. తద్వారా రైతుల్లో అసంతృప్తి మరింత పెరుగుతుందన్నారు. ప్రభుత్వం జాప్యం చేస్తే కౌలు రైతులు రాష్ట్రవ్యాప్తంగా, హైదరాబాద్‌లో కూడా ఆందోళనలకు సిద్ధమవుతారని హెచ్చరించారు.
