బీసీలను లెక్కించడానికి భయమెందుకు?..2027 జనగణనలో బీసీ కులగణన కాలమ్ ఏదీ: మంత్రి పొన్నం ప్రభాకర్

బీసీలను లెక్కించడానికి భయమెందుకు?..2027 జనగణనలో బీసీ కులగణన కాలమ్ ఏదీ: మంత్రి పొన్నం ప్రభాకర్
  • 2027 జనగణనలో బీసీ కులగణన కాలమ్ ఎందుకు పెట్టలేదు? 
  • ఓబీసీల గణనకు బీజేపీ ఎందుకు వెనకాడుతోంది?
  • కులగణనపై శాసనసభలో స్వల్పకాలిక చర్చలో మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్, వెలుగు: దేశంలో బీసీలు ఎంతమంది ఉన్నారో లెక్కించడానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. బీసీ ప్రధాని అని ప్రచారం చేసుకునే బీజేపీ.. బీసీల జనాభాను తేల్చడానికి ఎందుకు వెనుకడుగు వేస్తోందని   నిలదీశారు. 2027 జనగణనలో బీసీ, ఓబీసీ కులగణనను తప్పనిసరిగా చేర్చాలనే అంశంపై శుక్రవారం శాసనసభలో స్వల్పకాలిక చర్చను   ప్రారంభించి మాట్లాడుతూ.. కేంద్రం 2025 ఏప్రిల్ 1న కులగణన చేస్తామని ప్రకటించి.. 2026 ఆగస్టు 14న 40 ప్రశ్నల జనగణన ప్రశ్నావళిని ప్రకటించి.. అందులో బీసీలకు ప్రత్యేక ప్రశ్న లేకుండా తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు.

10వ ప్రశ్న ద్వారా ఎస్సీ, ఎస్టీల వివరాలు సేకరిస్తున్నప్పుడు.. బీసీలను ఎందుకు విస్మరించారని నిలదీశారు. దేశంలో బీసీల సంఖ్య ఎంత ఉందో తెలియకుండా బడ్జెట్ కేటాయింపులు, సంక్షేమ పథకాలు, రాజకీయ ప్రాతినిధ్యం, రిజర్వేషన్లను ఎలా నిర్ణయిస్తారని నిలదీశారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే దేశానికే రోల్ మోడల్‌‌‌‌గా నిలిచిందని, ఆ డేటా ఆధారంగానే రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనకు చట్టపరమైన చర్యలు చేపట్టామని తెలిపారు. 

కేంద్రం కూడా ఓపెన్ విధానంలో కాకుండా, తెలంగాణ తరహాలోనే శాస్త్రీయమైన ‘డ్రాప్‌‌‌‌డౌన్’ పద్ధతిలో బీసీ కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు.  తెలంగాణలో బీసీలకు సీఎం పదవి ఇస్తామంటూ ప్రచారం చేసుకున్న బీజేపీకి, అసెంబ్లీలో కనీసం ఫ్లోర్‌‌‌‌ లీడర్‌‌‌‌గా బీసీ నేతను నియమించే చిత్తశుద్ధి కూడా లేదని ఎద్దేవా చేశారు.  బీసీల విషయంలో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు సామాజిక న్యాయం కోసం ఒకే మాటపై నిలబడాలన్నారు. 

రిజర్వేషన్లు మన హక్కు: మంత్రి వాకిటి శ్రీహరి

బీసీల రిజర్వేషన్లు ఎవరూ ఇచ్చినా.. అది దానం కాదని, సామాజిక న్యాయం కోసం దశాబ్దాలుగా సాగిన పోరాటాల ఫలితమని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.  కేంద్రంలో 12 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ.. బీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఎందుకు ఏర్పాటు చేయలేదని నిలదీశారు. రాహుల్ గాంధీ ఇచ్చిన ‘జిత్నీ ఆబాదీ.. ఉత్నా హక్’ (ఎవరి జనాభా ఎంత ఉంటుందో.. వారికి అంత వాటా దక్కాలి) నినాదంతోనే తెలంగాణ ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. కేంద్రం తక్షణమే 2027 సెన్సస్‌‌‌‌లో బీసీ కులగణన కాలమ్‌‌‌‌ను చేర్చి, బీసీలకు జనాభా నిష్పత్తి ప్రకారం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం చేపట్టే జనగణనలో బీసీల కులగణనను  చేర్చాలని,  బీసీలను లెక్కించాలని, బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

కులగణన సామాజిక న్యాయానికి పునాది: ఆది శ్రీనివాస్

కులగణన అనేది కేవలం జనాభా సంఖ్యను లెక్కించడం మాత్రమే కాదని, అది బడుగు, బలహీన వర్గాల సామాజిక న్యాయానికి పునాది అని విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన ప్రక్రియ దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం జనగణనలో అనుసరించాలనుకుంటున్న ఓపెన్ ఫార్మాట్ విధానం వల్ల క్షేత్రస్థాయిలో తీవ్ర గందరగోళం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.  అందుకే ప్రతి కులానికి ఒక కచ్చితమైన కోడ్, కేటగిరీని ముందే రూపొందించి డ్రాప్‌‌‌‌డౌన్ విధానాన్ని తీసుకురావాలని సూచించారు.

కేంద్రం 2011 నాటి కుల సర్వే డేటాను ఎందుకు దాచింది?:  దానం నాగేందర్ 

దేశంలో త్వరలో చేపట్టబోయే జనగణనలో బీసీ, ఓబీసీ కులగణనను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా నిర్వహించాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ డిమాండ్ చేశారు. 2011లో యూపీఏ హయాంలో చేపట్టిన సామాజిక, ఆర్థిక, కుల సర్వే (ఎస్​ఈసీసీ-2011) డేటాను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇప్పటివరకు ఎందుకు బయటపెట్టకుండా తొక్కిపెట్టిందో సమాధానం చెప్పాలన్నారు.  

కులవృత్తులకే పరిమితం కావాల్నా? :  పాయల్ శంకర్ 

తరతరాలుగా బీసీలు కేవలం కులవృత్తులకే పరిమితం కావాలా? వారికి రాజ్యాధికారంలో వాటా ఉండదా? అంటూ ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు.  గతంలో కేసీఆర్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేసి బీసీలకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. ఉమ్మడి ఏపీలో కళకళలాడిన బీసీ కార్పొరేషన్లు.. తెలంగాణ వచ్చాక నిర్వీర్యమయ్యాయన్నారు.   

బీసీ డిక్లరేషన్ హామీలు ఏమయ్యాయి?:  ఏలేటి మహేశ్వర్‌‌‌‌‌‌‌‌రెడ్డి

కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌‌‌‌‌‌‌‌లో ప్రకటించిన రూ.20 వేల కోట్ల సబ్ ప్లాన్‌‌‌‌‌‌‌‌ను ఇప్పటివరకు ఎందుకు అమలు చేయలేదని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌‌‌‌‌‌‌‌ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర కేబినెట్‌‌‌‌‌‌‌‌లో ఎంతమంది బీసీలకు మంత్రులుగా అవకాశం ఇచ్చారో చెప్పాలని నిలదీశారు.  కేంద్రంపై నిందలు వేయడం మానుకొని, ఎన్నికల సమయంలో బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.  

బీజేపీ మనువాద పార్టీ : పొన్నం

బీజేపీ ఒక మనువాద పార్టీ అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో బీసీ కులగణన తీర్మానంపై బీజేపీ సభ్యులు వాకౌట్ చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు సంబంధించిన తీర్మానంపై బీజేపీ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందన్నారు. బీసీ కులగణన విషయంలో ఆ పార్టీ అనుసరిస్తున్న వైఖరిని తెలంగాణ ప్రజలకు స్పష్టంగా తెలియజేయాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. 

బీసీల అధికారిక జాబితాను కులగణనలో చేర్చాలని తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిందన్నారు.  కేంద్ర ప్రభుత్వం చెప్పిన విధానానికి అనుగుణంగానే బీసీల వివరాలను కులగణనలో నమోదు చేయాలని తాము కోరుతున్నామని, ఈ తీర్మానానికి సభ లోపల మద్దతు తెలిపి, బయట మాత్రం అందుకు భిన్నంగా మాట్లాడటం బీజేపీ ద్వంద్వ నీతికి నిదర్శనమన్నారు. 

బీజేపీ వైఖరి తెలంగాణ బీసీలకు అత్యంత అవమానకరమన్నారు. అంతకుముందు, జనగణనలో బీసీ కులగణన చేపట్టాలని కోరుతూ చేసిన తీర్మానంపై స్పష్టత ఇవ్వాలని మంత్రులు, ఎమ్మెల్యేలు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్​ను కోరారు. దీనికి ఆయన స్పందించకుండా.. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించారు. 

కులగణన చేయాలా? వద్దా?..బీజేపీ సభ్యులు సమాధానం చెప్పాలి: డిప్యూటీ సీఎం భట్టి  

దేశంలో సామాజిక అసమానతలను తొలగించి బలహీన వర్గాలకు న్యాయం చేయాలంటే జనగణనలో కులగణనను తప్పనిసరని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. కులగణన చేద్దామా? వద్దా? అనే విషయాన్ని బీజేపీ సభ్యులు సూటిగా చెప్పాలన్నారు. కులగణనకు అనుకూలమైతే సభ తరఫున కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానికి పిలుపునివ్వాలని.. వ్యతిరేకమైతే అదే విషయాన్ని స్పష్టంగా చెప్పాలన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక, రాజకీయ సర్వేను ఆదర్శంగా తీసుకొని, దేశవ్యాప్తంగా ఇలాంటి సమగ్ర సర్వే నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులపై సమగ్ర సర్వే నిర్వహించిందని తెలిపారు. ఈ సర్వే దేశానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. సర్వే నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు ప్రతిపక్ష సభ్యులు సైతం అభినందించారని గుర్తుచేశారు. 

అలాగే, దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి పార్లమెంట్‌‌‌‌లోని వివిధ పార్టీల నాయకులతోపాటు ప్రధాని మోదీని కూడా కలిసి విజ్ఞప్తి చేసినా ఆశించిన స్పందన రాలేదన్నారు. ప్రస్తుతం జరుగుతున్న జనగణనలో కులగణనను చేర్చకపోవడం బాధాకరమన్నారు. ఇచ్చిన మాట ప్రకారం జనగణనలో కులగణనను చేర్చాలని డిమాండ్ చేశారు. దేశంలో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా తెలంగాణలో నిర్వహించిన తరహాలో సామాజిక, ఆర్థిక, రాజకీయ సర్వే నిర్వహిస్తామని ప్రకటించారు.