జీ-7 కంటే బ్రిక్స్‌‌‌‌‌‌‌‌దే పైచేయి.. ప్రపంచ జీడీపీలో 40 శాతం బ్రిక్స్ దేశాల నుంచే: పుతిన్

జీ-7 కంటే బ్రిక్స్‌‌‌‌‌‌‌‌దే పైచేయి.. ప్రపంచ జీడీపీలో 40 శాతం బ్రిక్స్ దేశాల నుంచే: పుతిన్
  • జీ7 దేశాల వాటా 29 శాతమేనని ఎద్దేవా
  • బ్రిక్స్ ఎవరికీ వ్యతిరేకం కాదు.. ప్రపంచ దేశాలతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని వెల్లడి

న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక వృద్ధిలో అమెరికా, ఐరోపా దేశాల కూటమి జి-7 ప్రభావాన్ని తక్కువ చేస్తూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ జిడిపిలో బ్రిక్స్ కూటమి వాటా అంతకంతకూ పెరుగుతోందని స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో ప్రపంచ జీడీపీలో 40 శాతానికి పైగా బ్రిక్స్ దేశాల నుంచే ఉత్పత్తి అయిందని, కానీ జీ-7 దేశాల వాటా మాత్రం కేవలం 29 శాతానికే పరిమితమైందని ఎద్దేవా చేశారు. అసలు వారిని ఎందుకు గ్రూప్ ఆఫ్ సెవెన్ అంటున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. ఢిల్లీలో జరిగిన ‘బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్’లో రష్యా అధ్యక్షుడు పుతిన్ మాట్లాడారు.

ప్రస్తుతం ప్రపంచం తీవ్రమైన నిర్మాణపరమైన మార్పులకు లోనవుతోందని, ఒకప్పుడు ఆర్థిక వృద్ధికి అగ్రగామిగా ఉన్న పాత దేశాల స్థానంలో ఇప్పుడు కొత్త దేశాలు వృద్ధి ఇంజిన్‌‌‌‌‌‌‌‌లుగా మారుతున్నాయని పేర్కొన్నారు. ప్రధాని మోదీ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ప్రస్తుతం విస్తరించిన బ్రిక్స్ కూటమిలో సభ్య దేశాల సంఖ్య 21కి చేరిందని, ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో శక్తివంతమైన వేదికగా మారుతోందని ఇరు దేశాల అధినేతలు అభిప్రాయపడ్డారు. కాగా, బ్రిక్స్ కూటమి ఎవరికీ వ్యతిరేకం కాదని పుతిన్ చెప్పారు. ప్రపంచ దేశాలతో కలిసి పని చేసేందుకు రష్యా సిద్ధంగా ఉందని వెల్లడించారు. 

ద్వైపాక్షిక చర్చలు.. శాంతికే భారత్ పెద్దపీట 
ఈ సదస్సు సందర్భంగా దాదాపు 45 నిమిషాల పాటు భేటీ అయిన ప్రధాని మోదీ,  పుతిన్  రక్షణ, ఇంధన, అంతరిక్ష, వాణిజ్య రంగాల సహకారంపై చర్చించారు. పశ్చిమాసియా, రష్యా- ఉక్రెయిన్ యుద్ధాల వల్ల  ఏర్పడిన సంక్షోభంపై ఆందోళన వ్యక్తం చేశారు. రష్యా పర్యటనకు రావాలని పుతిన్ ఆహ్వానించగా..  మోదీ అంగీకరించారు.

అనంతరం ఇరువురు నేతలు ఒకే కార్‌‌‌‌‌‌‌‌లో ప్రయాణించారు. బ్రిక్స్ ఆర్థిక సహకారం ఎవరికీ వ్యతిరేకం కాదని, సభ్య దేశాల జాతీయ ప్రయోజనాల సాధన కోసమేనని స్పష్టం చేశారు. ఆర్కిటిక్ రవాణా, ఉత్తర-దక్షిణ రవాణా కారిడార్ ప్రాజెక్టులతో పాటు ఏఐ, డ్రోన్ రవాణా, ఆర్థిక రంగం, పర్యాటకం, పరిశ్రమలలో భాగస్వామ్యానికి రష్యా సిద్ధంగా ఉందని వెల్లడించారు.