నా దోస్త్ కంపెనీ పెడతా అంటే.. ప్రభుత్వం సహకరించట్లే : ఎమ్మెల్యే దానం నాగేందర్

నా దోస్త్ కంపెనీ పెడతా అంటే.. ప్రభుత్వం సహకరించట్లే : ఎమ్మెల్యే దానం నాగేందర్
  • అమెరికాలో సీఎం ఉన్నప్పుడు కంపెనీ యజమానితో మీటింగ్‌‌‌‌ కోసం ట్రై చేసిన: దానం
  • టైర్‌‌‌‌-2 సిటీలకు ఐటీని విస్తరించాలి
  • కంపెనీలకు ఇచ్చిన భూములను రియల్‌‌‌‌ ఎస్టేట్‌‌‌‌కు వాడొద్దు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కంపెనీలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం మరింత ప్రోత్సాహం ఇవ్వాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కోరారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఫార్చ్యూన్‌‌‌‌-500 కంపెనీల్లో ఒకటైన ఇన్ఫినిటీ కంపెనీ హైదరాబాద్‌‌‌‌లో ఏర్పాటు చేయాలని ప్రయత్నించినా.. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేక వెనక్కి వెళ్లిందని చెప్పారు. అమెరికా పర్యటనలో సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డి ఉన్నప్పుడు కంపెనీ యజమాని సంజయ్‌‌‌‌ గోయల్‌‌‌‌తో మీటింగ్‌‌‌‌ ఏర్పాటు చేసేందుకు తాను ప్రయత్నించినట్లు తెలిపారు.

“హైదరాబాద్‌‌‌‌లో ఇన్ఫినిటీ కంపెనీ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేక వెనక్కి వెళ్లారు. ప్రభుత్వం ప్రోత్సహించకపోతే కంపెనీలు ఎలా వస్తాయి?” అని ప్రశ్నించారు. ఐటీ కంపెనీల ఏర్పాటు హైదరాబాద్‌‌‌‌కే పరిమితం కాకుండా టైర్‌‌‌‌-2 సిటీలకు కూడా విస్తరించాలని దానం సూచించారు. ఈ విషయంలో ఐటీ మంత్రి శ్రీధర్‌‌‌‌బాబు చొరవ తీసుకుని ఇన్ఫినిటీ కంపెనీ యజమానితో మాట్లాడాలని కోరారు. ఐటీ కంపెనీల కోసం ప్రభుత్వం కేటాయించిన భూములను కొందరు రియల్‌‌‌‌ ఎస్టేట్‌‌‌‌ వ్యాపారానికి ఉపయోగిస్తున్నాయని దానం ఆరోపించారు. కంపెనీ ఏర్పాటు కోసం భూమి ఇచ్చినప్పుడు.. అదే ఉద్దేశంతో ఉపయోగించేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డి కృషి చేస్తున్నారని దానం నాగేందర్ తెలిపారు.