న్యూఢిల్లీ: బ్రిక్స్ సమిట్‌కు హాజరయ్యే వివిధ దేశాల ప్రతినిధులు, జర్నలిస్టుల కోసం ప్రత్యేక గూడీ బ్యాగ్‌ల(కానుకల ప్యాకెట్)ను సిద్ధం చేశారు. మన దేశ సంస్కృతిని, స్థానిక ఉత్పత్తులను ప్రపంచానికి పరిచయం చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. 'ఇండియా ఈజ్ గోయింగ్ వోకల్ ఫర్ లోకల్' అనే నినాదానికి తగినట్లుగా కానుకల హ్యాంపర్‌ను రూపొందించారు. ఇందులో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 9 రకాల వస్తువులను పొందుపరిచారు. వీటిలో బీహార్‌కు చెందిన సత్తు, మఖానా ఉన్నాయి.
ఒడిశా గిరిజన ప్రాంతాల కొండల నుంచి సేకరించిన 100 శాతం అరాబికా కాఫీ పౌడర్ కూడా ఈ బ్యాగ్‌లో చేర్చారు. గుజరాత్‌కు చెందిన బ్లాక్-ప్రింటెడ్ కండువా (స్టోల్), అందమైన కాఫీ మగ్, టోట్ బ్యాగ్ ఉన్నాయి. జర్నలిస్టులు ఎక్కడికైనా వెళ్లేటప్పుడు తమ మొబైల్స్ లేదా ఇతర పరికరాలను సులభంగా ఛార్జ్ చేసుకోవడానికి వీలుగా దీనికి ఇంటర్నల్ ఛార్జింగ్ పోర్ట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సదస్సును కవర్ చేయడానికి విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు వస్తున్నారు. వారందరికీ ఈ గూడీ బ్యాగ్ చక్కటి జ్ఞాపకంగా నిలవనుంది.
