- పాలమూరులోని కల్లు డిపో వద్ద స్థానిక గీత కార్మికుల నిరసన
మహబూబ్‌నగర్ అర్బన్, వెలుగు : మహబూబ్‌నగర్ నగరంలోని రెండు వర్గాలకు చెందిన గీత కార్మికుల మధ్య వర్గపోరు తారా స్థాయికి చేరుకుంది. దుకాణాల కేటాయింపు, లైసెన్సుల విషయంలో రెండు రోజులుగా ఈ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. తాజాగా ఈ రెండు వర్గాల మధ్య మాటమాట పెరిగిన ఘర్షణకు దారితీయడంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
జరిగింది ఇదీ..
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదేండ్ల పాటు ఆ పార్టీకి ప్రతాప్ గౌడ్ అనే వ్యక్తి సపోర్ట్‌గా ఉన్నారు. ఇటీవల మహబూబ్‌నగర్ కల్లు సొసైటీ ఎన్నికలు జరుగగా ప్రతాప్ గౌడ్ ప్యానెల్ గెలుపొందడంతో, ఆయన సొసైటీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. నెల కిందట ఆయన అనుచరులతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి రాష్ర్ట ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. మొన్నటి వరకు బీఆర్ఎస్ లో ఉన్న ప్రతాప్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంటనే కల్లు సొసైటీనీ అతడికి అప్పగించడంపై గౌడ కులస్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమకు సొసైటీలో సభ్యత్వం ఇవ్వకుండా, ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారిని మెంబర్లుగా ఎలా చేసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. స్థానికులను అణచి వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కల్లు డిపో వద్ద ఆందోళన...
సొసైటీలో సభ్యత్వం కల్పించడంతో పాటు, పార్టనర్ షిప్ ఇప్పంచాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మహబూబ్‌నగర్ రూరల్ మండలంలోని వెంకటాపురం వద్ద ఉన్న కల్లు డిపో వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఆందోళనకు దిగిన మరో వర్గం లీడర్ కుమార్ గౌడ్ వర్గానికి చెందిన పలువురి అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. కాగా నిజమైన కులవృత్తిదారులను గుర్తించి న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని గీత కార్మికులు హెచ్చరిస్తున్నారు.
