కురుమూర్తి ఆలయంలో లడ్డు ప్రసాదం తూకం తనిఖీ..కేసు నమోదు

కురుమూర్తి ఆలయంలో లడ్డు ప్రసాదం తూకం తనిఖీ..కేసు నమోదు

 చిన్న చింతకుంట, వెలుగు : మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మపూర్ గ్రామ సమీపంలోని కురుమూర్తి స్వామి ఆలయంలో శుక్రవారం జిల్లా తూనికలు, కొలతల అధికారి పి. రవీందర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.  నిబంధనలకు విరుద్ధంగా తక్కువ బరువుతో లడ్డూలను విక్రయిస్తున్న కాంట్రాక్టర్​పై కేసు నమోదు చేశారు. 

భక్తుల ఫిర్యాదు మేరకు ఆలయంలోని ప్రసాదం తయారీ ప్రాంతాన్ని పరిశీలించి లడ్డూలను తూకం వేయగా, వంద గ్రాములు ఉండాల్సిన బరువుకు బదులుగా కేవలం 75 నుంచి 80 గ్రాములు మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. నిర్ణీత తూకం కంటే తక్కువగా లడ్డూలను అమ్ముతూ మోసానికి పాల్పడుతున్నట్లు తేలడంతో సదరు టెండర్దారుపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.