హైదరాబాద్, వెలుగు: కేజీబీవీల్లో 15 నుంచి 20 ఏండ్లుగా పని చేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందిని క్రమబద్ధీకరించి ఉద్యోగ, వేతన భద్రత కల్పించాలని ఎమ్మెల్సీ మల్క కొమరయ్య డిమాండ్ చేశారు. శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ 2024 డిసెంబర్ 10 నుంచి 2025 జనవరి 7 వరకు జరిగిన సమ్మె కాలపు వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ వర్సిటీలపై తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహిస్తూ స్పష్టమైన హైబ్రిడ్ ఇంధన విధానం రూపొందించాలని, మూతపడిన బయోమాస్, వేస్ట్ -టు -ఎనర్జీ ప్లాంట్లను పునరుద్ధరించాలని సూచించారు. పీఎం- కుసుమ్, రూఫ్ టాప్ సోలార్ పథకాలను విస్తరించి సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
