హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు పీఆర్వో కమ్ మీడియా కోఆర్డినేటర్ మహేశ్ మాణిక్య, వ్యక్తిగత సహాయకుడు కె.మహేందర్ అలియాస్ మహేందర్రెడ్డిలపై తదుపరి విచారణ వరకు కఠిన చర్యలు తీసుకోవద్దని శుక్రవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కేసుకు సంబంధించిన వివరాలను సమర్పించాలంటూ పోలీసులతోపాటు ఫిర్యాదుదారుకు కోర్టు నోటీసులు ఇచ్చింది.
ఈ నెల 7న అసెంబ్లీ ప్రారంభం సందర్భంగా పోలీసులు, మార్షల్స్ విధులకు ఆటంకం కలిగించేలా బీఆర్ఎస్ నేతలను రెచ్చగొట్టారన్న ఆరోపణలతో సైఫాబాద్ పోలీసులు మహేశ్, మహేందర్రెడ్డిలపై కేసు నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలని కోరుతూ ఇద్దరూ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్లపై జస్టిస్ జె.శ్రీనివాసరావు శుక్రవారం విచారణ చేపట్టారు. తదుపరి విచారణ వరకు పిటిషనర్లపై కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించారు. కేసు విచారణను ఈ నెల 21కి వాయిదా వేశారు.
