మజ్లిస్ భయంతోనే విమోచన చరిత్రను తొక్కేశారు : రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్ 

 మజ్లిస్ భయంతోనే విమోచన చరిత్రను తొక్కేశారు : రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్ 
  • పరకాల, బైరాన్‌పల్లి నెత్తుటి గాథలను పాఠ్యాంశాల్లో చేర్చాలి 
  • బీజేపీ ఎంపీ లక్ష్మణ్ 

హైదరాబాద్, వెలుగు: మజ్లిస్ పార్టీకి భయపడే గత పాలకులు తెలంగాణ విమోచన చరిత్రను తొక్కిపెట్టారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్ ఆరోపించారు. నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వస్తే, నాటి నిజాం రాచరిక సంకెళ్లలో నాడు తెలంగాణ మరో 13 నెలలు నరకయాతన అనుభవించిందని తెలిపారు. పరకాల, బైరాన్‌పల్లి నెత్తుటి గాథలను నేటి తరానికి తెలిసేలా పాఠ్యాంశాల్లో చేర్చాలని డిమాండ్ చేశారు.

17న విమోచన వేడుకలకు ఉప రాష్ట్రపతి..

ఈనెల 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు మాజీ ఎంపీ  బూర నర్సయ్యగౌడ్ వెల్లడించారు. కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి నేతృత్వంలో జరిగే ఈ వేడుకల్లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా విశిష్ట అతిథిగా పాల్గొంటారన్నారు. విమోచనోద్యమం కేవలం కమ్యూనిస్టుల పోరాటమే కాదని, 1930ల నుంచే ఆర్యసమాజ్, ఆర్ఎస్ఎస్, హిందూ మహాసభలు నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడాయని గుర్తుచేశారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఈనెల 12న తిరంగా ర్యాలీ, సదస్సు, 15న మహిళా శక్తి స్కూటీ ర్యాలీ, 16న మాక్ అసెంబ్లీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 17న రిపబ్లిక్ డే తరహాలో మార్చ్ పాస్ట్, సాంస్కృతిక ప్రదర్శనలతో కేంద్ర ప్రభుత్వం అత్యంత వైభవంగా వేడుకలను నిర్వహించనుందని పేర్కొన్నారు.