న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఐపీఓ త్వరలో రానున్న వేళ, స్టాక్ బ్రోకింగ్ ప్లాట్ ఫామ్ జెరోధా ఫౌండర్ నితిన్ కామత్ ఆ సంస్థతో తమకున్న బంధాన్ని గుర్తుచేసుకున్నారు. 2010లో తాము సంస్థను ప్రారంభించిన కొత్తలో ఎన్ఎస్ఈ చేసిన సాయం మరువలేనిదని 'ఎక్స్' వేదికగా తెలిపారు.
"ఆరంభంలో సొంత ట్రేడింగ్ ప్లాట్ఫా మ్ నిర్మించుకునేంత ఆర్థిక స్తోమత జెరోధాకు లేదు. ఆ సమయంలో ఎన్ఎస్ఈ ఉచితంగా అందించిన 'ఎన్ఎస్ఈ నౌ' ప్లాట్ఫామ్ వల్లే తాము బ్రోకరేజ్ రంగంలోకి అడుగు పెట్టగలిగాం" అని తెలిపారు.
సభ్యత్వం కోసం చెన్నై వెళ్లినప్పుడు ఎన్ఎఎస్ఈ అధికారులు ఎంతో ఆదరించారని, తమ దగ్గర డబ్బులు లేవని తెలిసి సుమారు రూ.5 లక్షల మెంబర్షిప్ పీజును కూడా మాఫీ చేశారని కామత్ వెల్లడించారు. తాము ఈ స్థాయిలో ఉండ టానికి ఎన్ఎస్ఈనే కారణమన్నారు.
