న్యూఢిల్లీ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆర్థిక, కీలక రంగాల్లోకి వేగంగా ప్రవేశిస్తున్న వేళ జవాబుదారీతనం, పటిష్ఠమైన భద్రతా చర్యలు తప్పనిసరి అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిస్టిక్ ఫెస్ట్ 2026లో శుక్రవారం ఆమె మాట్లాడారు. ఏఐ వేగంగా నిర్ణయాలు తీసుకోవడానికి సాయప డినప్పటికీ, మోసాలు, సైబర్ దాడులు అంతే వేగంగా వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
"ఏఐ నిర్ణయాలకు సహకరించొచ్చు, కానీ తుది బాధ్యత మాత్రం మనుషులు, సంస్థలదే' అని అన్నారు. నియంత్రణ లేని ఏఐ మానవాళికే ముప్పుగా మారుతుందంటూ ఆంత్రోపిక్ సంస్థ రీసెర్చర్ చేసిన హెచ్చరికలను తీవ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. సరైన రక్షణ చర్యలు తీసుకోకపోతే సమాజం భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందన్నారు. లాభాలు ఆర్జించే దేశాల్లో కంపెనీలు కచ్చితంగా పన్నులు చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పారు.
