ఏఐ బీభత్సం..ప్రభుత్వాల కార్యకలాపాల్లోకి.. చొరబడుతున్న ప్రైవేటు వ్యక్తులు

ఏఐ బీభత్సం..ప్రభుత్వాల కార్యకలాపాల్లోకి.. చొరబడుతున్న ప్రైవేటు వ్యక్తులు
  • 9 దేశాల్లో నకిలీ వార్తలు, ఫేక్ అకౌంట్లకు క్లాడ్ వాడకం
  • నిఘా, ఆయుధాల తయారీకీ కృత్రిమ మేధ వినియోగం
  • చివరకు రాకెట్ టెస్ట్ వరకు వెళ్లిన ఏఐ దుర్వినియోగం
  • డేటింగ్ యాప్స్ ద్వారా ఏఐతో 25 వేల మందికి టోకరా
  • యూజర్ డేటా దొంగతనానికి పాల్పడిన చైనా కంపెనీలు
  • అప్రమత్తమైన ఆంత్రోపిక్.. కొత్త భద్రతా వ్యవస్థల ఏర్పాటు
  • ఇందుకోసం కొత్తగా ‘ప్రిసర్వుడ్ థింకింగ్’ అనే ఫీచర్

శాన్​ఫ్రాన్సిస్కో:ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలక రంగాలపై బీభత్సం సృష్టిస్తోంది. ప్రైవేటు వ్యక్తులు క్లాడ్ సాయంతో ప్రభుత్వ కార్యకలాపాలపై దాడులు చేసేదాకా వెళ్తున్నారని ప్రముఖ కృత్రి మేథ సంస్థ ఆంత్రోపిక్ ఆందోళన వ్యక్తం చేసింది. క్లాడ్ చాట్ బాట్ కారణంగా జరిగిన తప్పులను, దుర్వినియోగాలపై ఆంత్రోపిక్ ఏఐ ఒక నివేదికలో వెల్లడించింది. 

సైబర్ దాడుల్లో ప్లానింగ్ నుంచి డేటా దొంగతనం వరకు మొత్తం ప్రక్రియను క్లాడ్ తో చేయించారని గుర్తించింది. రష్యా  హ్యాకింగ్ గ్రూప్ తమ మాల్‌‌ ‌‌వేర్ పట్టుబడినప్పుడు, దాన్ని ఆటోమేటిక్‌‌‌‌గా మార్చి మళ్ళీ దాడి చేసేందుకు ఏఐని వాడినట్టు తెలిపింది.

తొమ్మిది దేశాల్లో ఫేక్ ప్రచారాలు

రష్యా, ఇరాన్, టర్కీ, చైనా, గల్ఫ్ దేశాలతో సహా తొమ్మిది దేశాల్లో ప్రభుత్వ అనుకూల గ్రూపులు నకిలీ వార్తలు, నకిలీ డాక్యుమెంట్లు, వేల కొద్దీ ఫేక్ సోషల్ మీడియా అకౌంట్లు తయారు చేసేందుకు క్లాడ్ ను వాడుకున్నాయని తెలిపింది. మరికొన్ని గ్రూపులు తమ వ్యతిరేకులు, మైనారిటీలపై నిఘా పెట్టేందుకు, ఈ సాంకేతికతను వాడుకున్నట్టు తేలింది. అలాగే,  నాలుగు కేసుల్లో నిజమైన ఆయుధాల కోసం సాఫ్ట్‌‌‌‌వేర్ తయారు చేసినట్లు గుర్తించగా, ఒక రాకెట్‌‌‌‌ను వాస్తవంగా పరీక్షించిన ఉదంతమూ వెలుగులోకి వచ్చిందని ఆంత్రోపిక్ వివరించింది. 

డేటింగ్ యాప్స్ మోసం

ఒక చీటింగ్ నెట్‌‌‌‌వర్క్ ఏకంగా 4,700 ఏఐ బాట్లను ఉపయోగించి 25,000 మందిని డేటింగ్ యాప్స్ ద్వారా మోసగించింది. ఈ మోసపూరిత యాప్‌‌‌‌లు యాప్ స్టోర్, ప్లే స్టోర్ సమీక్షలను తప్పించుకునేలా ప్రత్యేకంగా డిజైన్ చేసుకోవడం గమనార్హం. కొన్ని యాప్‌‌‌‌లలో యూజర్లు తీవ్ర అనారోగ్యం, మానసిక వేదన గురించి చెప్పినా, ఏఐ బాట్ మామూలుగానే సంభాషణ కొనసాగించి ఆపడం లేదు. 

చైనా కంపెనీల కన్నం

మూన్ షాట్, డీప్ సీక్, జిఫూ, షావోమీ లాంటి చైనా సంస్థలు యూజర్ల ప్రశ్నలను క్లాడ్ కు పంపించి, జవాబులను తస్కరించి, వాటితో తమ సొంత ఏఐ మోడళ్లకు శిక్షణ ఇచ్చినట్లు కూడా తేలింది.  

ఆంత్రోపిక్ అలెర్ట్.. ఆ ఖాతాలు బ్యాన్!

క్లాడ్ దుర్వినియోగం కనిపెట్టిన వెంటనే సంబంధిత ఖాతాలను బ్యాన్ చేసి, ప్రభుత్వాలకు, ఇతర సంస్థలకు సమాచారం ఇచ్చినట్లు ఆంత్రోపిక్ తెలిపింది. ఆయుధాలు, పేలుడు పదార్థాల గురించిన ప్రశ్నలను పట్టుకోవడానికి కొత్త సిస్టమ్‌‌‌‌లు రూపొందించింది. క్లాడ్ ఇప్పుడు తన లోపలి ఆలోచనలను పూర్తిగా చూపించకుండా సారాంశమే చూపించేలా మార్చింది. 

'ప్రిసర్వ్ డ్ థింకింగ్’అనే  ఫీచర్ వల్ల మధ్యలో ఎవరూ క్లాడ్ ఆలోచనలను మార్చలేరు. ఒక్కో ఖాతాను బ్యాన్ చేయడం కాకుండా, వెనుక ఉన్న అసలు సంస్థలపైనే చర్యలు తీసుకుంటున్నట్లు, దాడి చేసేవారు ఒకేసారి పలు ఏఐ ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌లు వాడుతున్నందున అన్ని ఏఐ కంపెనీలు సమాచారం షేర్ చేసుకోవాలని ఆంత్రోపిక్ కోరింది.