సంగారెడ్డి టౌన్, వెలుగు : అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ నేతలు అనుసరించిన తీరును నిరసిస్తూ సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు గూండాయిజానికి పాల్పడ్డారని, దళితులను అవమానించేలా దళితులు నడిచిన నేలను పసుపు నీళ్లతో శుద్ధి చేయడం అనాగరిక చర్యలకు నిదర్శనమని నిర్మలా జగ్గారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకే బీఆర్ఎస్ నేతలు ఇలాంటి అరాచకాలకు పాల్పడుతున్నారని, భవిష్యత్లో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొని భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత్ కిషన్, మున్సిపల్ చైర్పర్సన్ కూన వనితా సంతోష్, సీడీసీ చైర్మన్ రామ్ రెడ్డి, నాయకులు జార్జ్, కిరణ్ గౌడ్, సంతోష్ , శ్రీకాంత్, రామ్ చందర్ నాయక్, శ్రీకాంత్ రెడ్డి, సందీప్ రెడ్డి, భూమేశ్, తదితరులు పాల్గొన్నారు.
