సిద్దిపేట టౌన్, వెలుగు: రాజకీయాల్లో రాణించాలన్నా, సమాజంలో గుర్తింపు సాధించాలన్నా ప్రతి నాయకుడికి, కార్యకర్తకు క్రమశిక్షణ, స్పష్టమైన లక్ష్యం తప్పనిసరి అని మెదక్ ఎంపీ ఎం. రఘునందన్ రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట పట్టణంలోని వీఎఆర్ గార్డెన్స్‌లో నిర్వహించిన సేవా సంకల్ప అభియాన్ జిల్లా స్థాయి కార్యశాల, ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని దిశానిర్దేశం చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు చేపట్టే సేవా కార్యక్రమాల్లో భాగంగా, కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఇండ్ల వద్ద ‘ఆశీస్సుల దీపం’ వెలిగించాలని సూచించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన చిన్నకోడూరు మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొని అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించడంతో పాటు, సిద్దిపేటలోని నల్ల పోచమ్మ ఆలయ వార్షికోత్సవంలో ప్రత్యేక పూజలు చేసి, టీటీసీ భవన్‌లో జరిగిన గురుపూజోత్సవ వేడుకల్లో ఉపాధ్యాయుల పాత్రను కొనియాడారు.
