- ..టైర్ 2 నగరాలకు ఐటీ కంపెనీలను విస్తరిస్తం
- వచ్చే వారంలో ఆదిలాబాద్ ఐటీ టవర్ ప్రారంభిస్తం
- ట్రిపుల్ ఆర్ నిర్మాణానికి కేంద్రం సహకరించట్లే
- ఈ ప్రాజెక్టుకు బీజేపీ సభ్యులు చొరవ చూపాలి
- అసెంబ్లీలో ఐటీ మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్మించిన ఐటీ హబ్స్/టవర్లపై అధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలన చేయించామని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. యాంకర్ పార్ట్నర్స్/ఇండస్ట్రీ పార్ట్నర్స్ భాగస్వామ్యం లేకుండానే వాటిని నిర్మించడం వల్ల.. చాలా చోట్ల అవి నిరుపయోగంగా మారాయన్నారు. అలాంటి వాటిని తిరిగి వినియోగంలోకి తెచ్చేలా చొరవ తీసుకుంటున్నామన్నారు. హైదరాబాద్ పై ఒత్తిడిని తగ్గించేందుకు నల్గొండ, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, కరీంనగర్ లాంటి టైర్ – 2 నగరాలకూ ఐటీ కంపెనీలను విస్తరిస్తున్నామని, వచ్చే వారంలో ఆదిలాబాద్ లో ఐటీ హబ్/టవర్ ను ప్రారంభించబోతున్నామని మంత్రి వెల్లడించారు.
యాంకర్ పార్ట్ నర్స్/ఇండస్ట్రీ పార్ట్ నర్స్ ముందుకొస్తే కొత్తగా ఐటీ హబ్స్/టవర్లను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. గురువారం అసెంబ్లీలో నిజామాబాద్ ఐటీ టవర్ లో కంపెనీల ఏర్పాటు, టైర్ 2 సిటీలకు ఐటీ కంపెనీల విస్తరణపై ఎమ్మెల్యేలు కాటేపల్లి వెంకటరమణారెడ్డి, ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, పాయల్ శంకర్ అడిగిన ప్రశ్నకు మంత్రి శ్రీధర్ బాబు సమాధానమిచ్చారు.
“ తెలంగాణ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించేలా ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నం. గత రెండేండ్లలో 75కి పైగా జీసీసీలు హైదరాబాద్ లో ప్రారంభమయ్యాయి. ఇది దేశంలోనే రికార్డు. రెండేండ్లలో లక్ష మంది యువతకు కొత్తగా ఉద్యోగాలు దక్కాయి. త్వరలోనే కొత్త జీసీసీ పాలసీని తీసుకొస్తున్నం. ఇటీవల హైదరాబాద్ లో టీసీఎస్ కంపెనీ భారీ డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ఆ కంపెనీతో న్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది” అని మంత్రి శ్రీధర్ బాబు గుర్తు చేశారు.
ట్రిపుల్ ఆర్ కు బీజేపీ సభ్యులు సహకరించాలి
ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి కేంద్రం సహకరించడం లేదని శ్రీధర్ బాబు అన్నారు. ఈ విషయంలో బీజేపీ ఎమ్మెల్యేలు చొరవ తీసుకోవాలని కోరారు. రీజినల్ రింగ్ రోడ్డు వస్తే జిల్లాలకు కనెక్టివిటీ పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అప్పుడు ఐటీ కంపెనీలు ముందుకు వచ్చే అవకాశం ఉందన్నారు.
డేటా సెంటర్లదే కీలక పాత్ర
ఐటీ కంపెనీలకు సంబంధించిన కాంప్రహెన్సివ్ ఎకో సిస్టంను అభివృద్ధి చేయడంలో డేటా సెంటర్లు కీలక పాత్ర పోషించబోతున్నాయని, అందుకే.. వాటిపైన ప్రత్యేక దృష్టి సారించామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. రాబోయే రోజుల్లో డేటా సెంటర్ల వల్ల ఏర్పడబోయే సవాళ్లను ఎదుర్కొనేలా ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టామన్నారు. స్థానిక అవసరాలకు ఇబ్బంది తలెత్తకుండా డేటా సెంటర్లకు అవసరమైన విద్యుత్ ను అందించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. టైర్ 2, టైర్ 3 నగరాలు, పట్టణాల్లోనూ డేటా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
రాష్ట్రానికి కొత్తగా పెట్టుబడులను ఆకర్షించేందుకు "తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్", బయో ఏషియా సదస్సు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రోడ్‌షోలు, సెక్టోరల్ కాంక్లేవ్స్ ను ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. పారిశ్రామికవేత్తలకు ఇబ్బందులు తలెత్తకుండా నోడల్ అధికారులతో ప్రత్యేకంగా ఇన్వెస్టర్ ఫెసిలిటేషన్ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. శుక్రవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో భాగంగా రాష్ట్రంలో పెట్టుబడులు, తెలంగాణ రైజింగ్ అనే అంశంపై ఎమ్మెల్యేలు అనిరుధ్ రెడ్డి, వేముల వీరేశం, వంశీకృష్ణ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.
ఫ్యూచర్ లేని పార్టీ..ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుతోంది
ఫ్యూచర్ లేని బీఆర్ఎస్ పార్టీ.. ఫ్యూచర్ గురించి, ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తున్నదని మంత్రి శ్రీధర్ బాబు ఎద్దేవా చేశారు. ఇటీవల ప్రతిపక్ష పార్టీలు ఫ్యూచర్ సిటీకి వెళ్లి తమ మీద విమర్శలు చేశారన్నారు. “యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దక్కొద్దనుకునే పార్టీ.. పెట్టుబడులు పెట్టకుండా పారిశ్రామికవేత్తలను భయభ్రాంతులకు గురి చేసే పార్టీ.. ఫార్మా సిటీ పేరిట తీవ్ర కాలుష్యాన్ని వెదజల్లే రెడ్ కేటగిరీ పరిశ్రమల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. అక్కడ ‘గ్రీన్ ఫార్మా’ పరిశ్రమల ఏర్పాటుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది.
ఇందులో ఎలాంటి సందేహం లేదు” అని మంత్రి స్పష్టం చేశారు. రేర్, ప్యూర్ ఏరియాల్లో పెట్టుబడులను పెట్టేందుకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు, రాయితీలను కల్పించే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. రాష్ట్రంలో రాబోయే అభివృద్ధి ప్రాజెక్టులకు అనుగుణంగా పారిశ్రామికాభివృద్ధిని మరింత ప్రోత్సహించేలా ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ పాలసీలకు శ్రీకారం చుడతామన్నారు. పారిశ్రామికాభివృద్ధిని రాష్ట్రంలోని టైర్ 2, టైర్ 2 నగరాలు, పట్టణాలకు విస్తరించేలా ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నామని శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
