1980 ట్రెండ్ పేరుతో సైబర్ చీటింగ్స్.. నకిలీ యాప్ లు, ఏపీకే ఫైల్స్తో మోసాలు..  

1980 ట్రెండ్ పేరుతో సైబర్ చీటింగ్స్.. నకిలీ యాప్ లు, ఏపీకే ఫైల్స్తో మోసాలు..  
  • జాగ్రత్తగా ఉండాలంటున్న పోలీసులు

మల్కాజ్ గిరి, వెలుగు: సోషల్ మీడియాలో ప్రస్తుతం హల్​చల్​చేస్తున్న ‘1980 ఏఐ ట్రెండ్' పేరుతో సైబర్ నేరగాళ్లు వల విసురుతున్నారు. ఆ తరం స్టైల్​లో మన ఫొటోలను చూసుకోవాలనే ఆశతో గుర్తు తెలియని యాప్స్​ను డౌన్​లోడ్​చేసుకుంటే ఫోన్ హ్యాక్​చేసి కొల్లగొడుతున్నారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఏపీకే ఫైల్స్​కూడా పంపించి కష్టార్జితాన్ని మాయం చేస్తారని, జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్​ఇస్తున్నారు. 

ఏఐ టూల్స్ సాయంతో మన ఫొటోలను 1980ల నాటి రెట్రో లుక్​లోకి మార్చుకోవడం ఇప్పుడు నెట్టింట పెద్ద క్రేజ్​గా మారింది. చాట్ జీపీటీ లాంటి యాప్​లలో ఉచిత వాడకానికి పరిమితులు ఉండటంతో, చాలామంది యూజర్లు ప్రత్యామ్నాయ యాప్​లవైపు చూస్తున్నారు. ఇదే అదనుగా సైబర్ నేరగాళ్లు రంగంలోకి దిగారు. ‘1980s AI Trend’  పేరుతో నకిలీ యాప్స్, ఏపీకే ఫైల్స్​ను తయారు చేసి, థర్డ్ పార్టీ వెబ్​సైట్స్, సోషల్ మీడియా లింక్​లు, టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా పంపిస్తున్నారు. క్షణాల్లో రెట్రో ఫొటోలు ఇచ్చేస్తామంటూ యూజర్లను ఆకర్షిస్తున్నారు.

ప్రమాదం ఇలా.. 

ఈ నకిలీ ఏపీకే ఫైల్ డౌన్​లోడ్​చేసి ఇన్​స్టాల్​చేయగానే..ఫోన్​లోని గ్యాలరీ, కాంటాక్ట్స్, ప్రైవేట్ ఫొటోలు హ్యాకర్ల చేతికి చిక్కుతాయి. ఈ మాల్వేర్ ద్వారా ఫోన్​పై నిఘా పెట్టి, బ్యాంకింగ్ వివరాలు, ఓటీపీలను కాజేస్తున్నారు. వ్యక్తిగత ఫొటోలను ఆసరాగా చేసుకుని బెదిరింపులకు దిగే ప్రమాదం కూడా ఉందని పోలీసులు అంటున్నారు.

ట్రెండ్ ఏదైనా సరే, గుర్తు తెలియని లింక్​ల నుంచి ఏపీకే ఫైల్స్​డౌన్​లోడ్​చేయవద్దని సైబర్ సెక్యూరిటీ నిపుణులు సూచిస్తున్నారు. అధికారిక యాప్ స్టోర్లలో లభించే నమ్మకమైన యాప్​లనే వాడాలని కోరుతున్నారు.