అటవీ సిబ్బంది సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట : మంత్రి జూపల్లి కృష్ణారావు

అటవీ సిబ్బంది సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట : మంత్రి జూపల్లి కృష్ణారావు
  • ఫ్రంట్‌‌‌‌లైన్‌‌‌‌ సిబ్బందికి ఆయుధాల కోసం రూ.4.95 కోట్ల ప్రతిపాదనలు
  • అటవీ శాఖలో 1,516 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడి
  • బీట్ ఆఫీసర్ నవీన్ కుటుంబానికి రూ.30 లక్షల చెక్కు అందజేత

హైదరాబాద్, వెలుగు: అడవులు, వన్యప్రాణుల రక్షణ కోసం పనిచేస్తున్న అటవీ సిబ్బంది సంక్షేమానికి, భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో ప్రాణాలకు తెగించి పోరాడే ఫ్రంట్‌‌‌‌ లైన్‌‌‌‌ సిబ్బంది ఆత్మరక్షణ, అటవీ నేరాల నియంత్రణ కోసం ఆయుధాలు అందించేందుకు రూ.4.95 కోట్ల అంచనాతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, ఇది పరిశీలనలో ఉందని తెలిపారు. ఎక్సైజ్ శాఖ సిబ్బందికి కూడా ఆయుధాలు ఇచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. శుక్రవారం హైదరాబాద్‌‌‌‌లోని నెహ్రూ జూలాజికల్ పార్కులో జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు.

జూలోని అమరవీరుల స్మారక స్తూపానికి మంత్రి జూపల్లి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్, వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, పీసీసీఎఫ్ వినయ్‌‌‌‌కుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి విధి నిర్వహణలోనే ప్రాణాలు కోల్పోయిన చెరువుసింగారం వెస్ట్ బీట్ ఆఫీసర్ బానోత్ నవీన్ కుటుంబానికి రూ.30 లక్షల ఎక్స్‌‌‌‌గ్రేషియా చెక్కును మంత్రి అందజేశారు. అటవీ శాఖను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం రిక్రూట్‌‌‌‌మెంట్‌‌‌‌పై దృష్టి సారించిందని చెప్పారు. అటవీ శాఖలో ఖాళీగా ఉన్న 1,393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, 15 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు, 18 అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పోస్టులతో కలిపి మొత్తం 1,516 ఉద్యోగాల నియామక ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించారు.