పాలిటెక్నిక్ ఫీజులు మార్చేది లేదు: మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం

పాలిటెక్నిక్ ఫీజులు మార్చేది లేదు: మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం

పాలిటెక్నిక్‌ల ఫీజుల విషయంలో జరుగుతున్న ప్రచారంలోనూ వాస్తవం లేదని మంత్రి వివేక్​ వెంకటస్వామి తెలిపారు. విద్యార్థులపై అదనపు ఆర్థిక భారం మోపే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. శిక్షణ సమయంలో విద్యార్థులకు రూ.2 వేల స్టైపెండ్ అందించే విషయాన్ని సీఎం రేవంత్​ రెడ్డి ఇప్పటికే ప్రకటించారని గుర్తుచేశారు. పాలిటెక్నిక్‌లను స్కిల్ వర్సిటీ పరిధిలోకి తీసుకురావడం వల్ల ప్రభుత్వ లెక్చరర్ల ఉద్యోగ హోదా మారుతుందన్న ఆందోళన అవసరం లేదన్నారు. 

ప్రభుత్వ ఉద్యోగులుగా వారి హోదా కొనసాగుతుందని, ప్రమోషన్లలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. పాలిటెక్నిక్‌లకు సంబంధించిన అంశాలపై విద్యార్థులు, లెక్చరర్లతో చర్చించేందుకు కమిటీని ఏర్పాటు చేశామని మంత్రి వెల్లడించారు. కేశవరావు ఆధ్వర్యంలోని కమిటీ చర్చలు జరుపుతోందని చెప్పారు. జీవో 97పై కూడా  అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. రాష్ట్రంలో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ల (ఏటీసీలు) ఆధునీకరణకు రూ.4 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టాటా టెక్నాలజీస్ భాగస్వామ్యంతో ఐటీఐలను ఆధునీకరించే ప్రక్రియ చేపట్టామని, ఇందుకోసం రూ.2,500 కోట్ల పెట్టుబడితో 65 ఏటీసీలను ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. మరో 54 కొత్త ఏటీసీలను కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఏటీసీల్లో కొత్త కరిక్యులమ్‌ను రూపొందించామని తెలిపారు. 

కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి జయంత్ చౌదరికి ఈ కరిక్యులమ్‌ను వివరించగా.. ఆయనతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మిక శాఖ మంత్రులు కూడా ప్రశంసించారని చెప్పారు. దేశవ్యాప్తంగా ఇదే తరహా కరిక్యులమ్ రూపొందించేందుకు తనను కమిటీకి చైర్మన్‌గా నియమించారని మంత్రి వివేక్ పేర్కొన్నారు.