- ఎన్యూమరేషన్ ఫారాల్లో పొరపాట్లు ఉండటంతో జారీ
హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా హైదరాబాద్‌లోని పలువురు సినీ, క్రీడా, వ్యాపార రంగ ప్రముఖులకు అధికారులు నోటీసులు జారీ చేశారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి, నటులు మహేశ్ బాబు–నమ్రత దంపతులు, విక్టరీ వెంకటేశ్, సమంత, విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, రామ్ చరణ్ సతీమణి ఉపాసనతో పాటు మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, పుల్లెల గోపీచంద్, సైనా నెహ్వాల్, మిథాలీ రాజ్ వంటి ప్రముఖ క్రీడాకారులకు నోటీసులు అందినట్లు సమాచారం. అంతేగాక, ప్రముఖ ఐటీ దిగ్గజం, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకణి కుటుంబసభ్యుల పేర్లపైనా నోటీసులు జారీ అయ్యాయి.
ఎన్యూమరేషన్ ఫారాల్లో నింపిన వివరాల్లో తప్పులు ఉండటం, పాత రికార్డులతో ప్రస్తుత వివరాలు సరిపోలకపోవడం వంటి కారణాల వల్లే సర్ నోటీసులు ఇచ్చినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. అయితే, నోటీసులు అందుకున్న వారు నేరుగా విచారణకు హాజరై లేదా తమ ప్రతినిధుల ద్వారా సరైన ధ్రువపత్రాలను సమర్పించి పొరపాట్లను సరిదిద్దుకోవచ్చని సూచించారు.
నోటీసులు జారీ అయినంత మాత్రాన ఓటు హక్కు రద్దయినట్లు కాదని, ఇది కేవలం ధ్రువీకరణ ప్రక్రియలో ఒక భాగం మాత్రమేనని వారు స్పష్టం చేశారు. గడువులోగా సరైన ఆధారాలు సమర్పించకపోతే మాత్రమే చర్యలు ఉంటాయని, వాస్తవాలను నిర్ధారించుకున్న తర్వాతే అర్హులైన ప్రతి ఒక్కరి ఓటును జాబితాలో కొనసాగిస్తామని ప్రకటించారు.
